టీడీపీ ఎంపీగా వైసీపీ సీనియర్ నేత...?

Update: 2022-12-22 11:06 GMT
ఆయన రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్నవారు. కాంగ్రెస్ తరఫున రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇప్పటికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పలు కీలక శాఖలకు పనిచేశారు. ఆయనే డీఎల్ రవీంద్రా రెడ్డి.రాష్ట్ర విభజన కాదు కానీ ఆయన రాజకీయం కూడా మారింది. 2014 తరువాత టీడీపీలో కొన్నాళ్ళు ఉన్నా అక్కడ ఏదీ కుదరకపోవడంతో 2019 నాటికి డీఎల్ వైసీపీ వైపు వచ్చారు.

ఆయన సేవలను వైసీపీ కడప జిల్లాలో వాడుకుంది అని ఆయన అభియోగం. కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఇక డీఎల్ అయితే వైసీపీలో ఎందుకు ఉన్నాను అని తనను తానే విమర్శించుకుంటున్నారు. ఆయన మైదుకూరు నుంచి గతంలో గెలిచారు. అక్కడ వైసీపీకి ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకు మరోమారు టికెట్ ఇస్తారు. ఇక డీఎల్ కి టికెట్ హుళక్కే. ఆ మధ్యన రాజ్యసభ సీట్లు భర్తీ చేశారు.

అందులో కూడా డీఎల్ పేరు ఎక్కడా లేకపోయేసరికి ఆయన బరస్ట్ అయిపోయారు. వీలు దొరికిందే చాలు అన్నట్లుగా ఆయన వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు. పైగా తాను వైసీపీలోనే ఉన్నానని, తనను ఎవరూ పార్టీ నుంచి పంపించలేదని చెబుతూనే జగన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ నేతృత్వంలో వైసీపీకి వచ్చే ఎన్నికల్లో  సింగిల్ డిజిట్ లోపే సీట్లు అని  డీఎల్  చెప్పేశారు.

ఇక ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబుని తెగ పొగుడుతున్నారు. ఆయన ఏపీకి సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది అని కూడా అంటున్నారు. ఏపీని జగన్ సర్వనాశనం చేస్తే బాగు చేసే సత్తా బాబుకు మాత్రమే ఉంది అని డీఎల్ చెబుతున్నారు. మరి డీఎల్ ఈ విధంగా వైసీపీలో ఉంటూ టీడీపీని పొగడడం వెనక కధ ఏంటి అంటే చాలానే ఉంది అంటున్నారు.

వచ్చే ఎన్నికల కోసం డీఎల్ చంద్రబాబుతో అన్నీ మాట్లాడుకుని ఉన్నారని అంటున్నారు. ఆయన కూడా తాజా మీడియా సమావేశంలో తాను ఒక ప్రముఖ పార్టీ నుంచే పోటీ చేస్తాను అని చెప్పుకున్నారు. దాంతో ఆ ప్రముఖ పార్టీ టీడీపీయే అని అంతా ఊహిస్తున్నారు. డీఎల్ కి మైదుకూరు టికెట్ ఇవ్వడం కుదరదు, అక్కడ యనమల రామక్రిష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర యాదవ్ ఉన్నారు.

ఆయనకే టికెట్ అన్నది కన్ ఫర్మ్. పైగా బీసీని తీసేసి రెడ్డికి టికెట్ ఇవ్వడానికి బాబు సాహసించరు. దాంతో డీఎల్ ని ఎలా వాడుకోవాలో బాబు ఆలోచించి ఆయనకు ఒక కచ్చితమైన హామీని ఇచ్చేశారుట. అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ సీటు నుంచి ఎంపీగా డీఎల్ కి టికెట్ ఇవ్వడానికి బాబు అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి డీఎల్ కి ఎమ్మెల్యే కావాలని టీడీపీ గెలిస్తే మంత్రి కావాలని ఉంది.

కానీ చంద్రబాబు మాత్రం మైదుకూరుకు బదులు ఎంపీగానే డీఎల్ కి అవకాశం ఇస్తామని చెప్పారని అంటున్నారు. దాంతో డీఎల్ అయిష్టంగానే అంగీకరించారు అని అంటున్నారు. నిజానికి ఆ ఆప్షన్ కూడా వదిలేసుకుంటే డీఎల్ కి రాజకీయంగా మరో ఆల్టర్నేషన్ లేదు తాను ఉన్న వైసీపీలో చాన్స్ లేదు, మరో రకంగా రాజకీయంగా చాన్స్ లేదు అందుకే  డీఎల్   ఎంపీగానే బరిలోకి దిగడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. 2011లో జరిగిన కడప లోక్ సభ ఉప ఎన్నికల్లో  డీఎల్   మంత్రిగా ఉంటూ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీకి దిగి ఓడిపోయారు. ఆనాడు టీడీపీ తరఫున ఎంవీ మైసూరారెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడారు.

ఆ తరువాత మైసూరారెడ్డి, ఆయన తరువాత  డీఎల్   రవీంద్రా రెడ్డి ఇద్దరూ వైసీపీలోకి వెళ్లారు. ఇద్దరికీ జగన్ నుంచి ఏ రకమైన రాజకీయ ప్రోత్సాహం లభించలేదు. మైసూరారెడ్డి చాలా కాలం క్రితమే తప్పుకుని ఏ పార్టీలో చేరకుండా ఉన్నారు. డీఎల్ కి ఇంకా రాజకీయ ఆశలు ఉండడంతో మరోమారు ఎంపీగా పోటీకి ట్రై చేయవచ్చు అంటున్నారు. మొత్తానికి వైసీపీలో ఉంటూ జగన్ని విమర్శిస్తున్న డీఎల్ ని చూసిన వారు మరో రఘురామ రాజుని గుర్తుకు తెస్తున్నారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News