ఏపీలో సలహాదారుల వ్యవహారంలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-01-06 07:00 GMT
ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మందిని సలహాదారులుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 70 మంది వరకు సలహాదారులు ఉన్నారని.. వీరికి నెలకు లక్షల రూపాయల్లో వేతనాలు, ఇతర సౌకర్యాలు అందజేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. అలాగే కొంతమంది సలహాదారులకు కేబినెట్‌ హోదాను సైతం వర్తింపజేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకాలు ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టరు, పోలీసు కమిషనర్, తహసీల్దార్లకు సైతం సలహాదారులను నియమించుకునే ప్రమాదం ఉందని హాట్‌ కామెంట్స్‌ చేసింది. ఇలాగైతే సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడుందని ప్రభుత్వాన్ని నిలదీసింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్థం చేసుకోగలంగానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులేంటని సూటిగా నిలదీసింది. ప్రభుత్వం తన చర్యలను ఏవిధంగా సమర్థించుకుంటుందని ప్రశ్నించింది.

ఈ క్రమంలో సలహాదారుల నియామకాలు రాజ్యాంగబద్ధమో, కాదో తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సలహాదారుల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలేంటో తేలుస్తామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత మంది సలహాదారులున్నారు? ప్రభుత్వశాఖల వారీగా ఎంత మందిని నియమించారు? సలహాదారుల నియామకం విషయంలో అనుసరిస్తున్న విధివిధానాలేంటి వంటి అంశాల్లో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ను ఆదేశించింది.

ఓ పీఠాధిపతి సలహా మేరకు జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖకు సలహాదారుగా నియమించామని ఏజీ శ్రీరామ్‌ ఇచ్చిన వివరణపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సలహాదారుల నియామకంతో పీఠాధిపతులకు పనేంటని నిలదీసింది.

పీఠాధిపతులు ఉన్నది ప్రభుత్వాలను నడపడానికి కాదని వ్యాఖ్యానించింది. వారు దేవాలయాల వ్యవహారాలకే పరిమితం కావడం ఉత్తమమని కోర్టు సూచించింది. ఇష్టానుసారంగా సలహాదారుల నియామక విషయం సరికాదని వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా ఆదేశాలిచ్చింది.

కాగా ప్రభుత్వ సలహాదారుగా (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా ప్రస్తుత పిటిషన్‌తో జత చేయాలని  రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయశాఖకు సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 630ని జారీ చేసిన సంగతి తెలిసిందే. దానిని సవాలు చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్‌.కె.రాజశేఖరరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. జీవో 630ని దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమైనదిగా ప్రకటించి దానిని రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌ లో కోర్టుకు విన్నవించారు. శ్రీకాంత్‌ ఎందులో నిపుణుడో.. ఏ అర్హతలు చూసి దేవాదాయ శాఖ సలహాదారుగా నియమించారో జీవోలో పేర్కొనలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.

శ్రీకాంత్‌ ను దేవాదాయ శాఖ సలహాదారుగా నియమించడమే కాకుండా ప్రొటోకాల్‌తో కూడిన సౌకర్యాలు, నెలకు రూ. 1.6 లక్షల జీతభత్యాలు కల్పిస్తున్నారని పిటిషనర్‌ రాజశేఖరరావు కోర్టు దృష్టికి తెచ్చారు. గతేడాది సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News