ప్రెగ్నెంట్ అని ఆ క్రీడాకారిణి త‌ప్పుగా చెప్పింద‌ట‌

Update: 2017-04-26 16:02 GMT
టెన్నిస్ స్టార్ సెరీనా విలియ‌మ్స్ పేద్ద జోక్ వేసింది.20 వారాల గ‌ర్భిణి అంటూ సెరీనా ఇటీవ‌ల త‌న స్నాప్‌ చాట్ అకౌంట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే త‌న ప్రెగ్నెన్సీ వార్త‌ను పొర‌పాటును బ‌య‌ట‌కు వెల్ల‌డించింద‌ట‌. అనుకోకుండా స్నాప్‌ చాట్‌ లో ప్రెగ్నెన్సీ ఫోటోను అప్‌ లోడ్ చేశాన‌ని, ఆ త‌ర్వాత పూర్తి వివ‌రాల్ని వెల్ల‌డించాల్సి వ‌చ్చింద‌ని అమెరికా టెన్నిస్ ప్లేయ‌ర్ సెరీనా పేర్కొన్న‌ది. 23 గ్రాండ్‌ స్లామ్ టైటిళ్లు గెలిచిన న‌ల్ల‌క‌లువ ప్ర‌తి వారం త‌న గ‌ర్భం ఫోటోల‌ను తీసుకుంటు వెళ్లింద‌ట‌. ఆ ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మొబైల్‌ లో సేవ్ చేసుకున్న‌ద‌ట‌. కానీ అనుకోకుండా ఓ ఫోటో స్నాప్ చాట్ లిస్టులోకి వెళ్లిపోయింద‌ని సెరీనా పేర్కొన్న‌ది. ఆ కార‌ణంగానే పూర్తి విష‌యాన్ని చెప్పాల్సి వ‌చ్చింద‌ని టెన్నిస్ స్టార్ వెల్ల‌డించింది.

జ‌న‌వ‌రిలో జ‌రిగిన ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ కు రెండు రోజుల ముందే తాను ప్రెగ్నెంట్ అన్న విష‌యం తెలిసింద‌ని ఆమె పేర్కొంది. ఆ గ్రాండ్‌ స్లామ్ ఫైన‌ల్లో త‌న అక్క వీన‌స్‌ ను ఓడించి టైటిల్‌ ను  కైవ‌సం చేసుకుంది. కానీ గ‌ర్భంతోనే గ్రాండ్‌ స్లామ్ టోర్నీని గెల‌వడం అంత ఈజీ ప‌నికాదు అని సెరీనా పేర్కొంది. సాధార‌ణంగా ప్రెగ్నెంట్ మ‌హిళ‌లు ఏదో ర‌క‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని, కానీ ఆ విష‌యం తెలుసుకున్న తాను ఫైన‌ల్లో చాలా ఎన‌ర్జీని వాడాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. తాను ప్రెగ్నెంట్ అన్న విష‌యం ఎవ‌రికీ తెలియ‌ద‌ని - టోర్న‌మెంట్ గెల‌వాల‌న్న‌దే త‌న కాంక్ష అని - ఆడిన ప్ర‌తిసారీ గెల‌వాల‌ని అనుకుంటానని, ఒక‌వేళ టోర్నీ గెల‌వ‌క‌పోతే - అప్పుడు అది మ‌రింత పెద్ద వార్త అవుతుంద‌ని గ్ర‌హించాన‌ని సెరీనా పేర్కొంది.

ప్ర‌స్తుతం మెట‌ర్నిటీ సెల‌వుల్లో ఉన్న సెరీనా ఈ ఏడాది మిగితా గ్రాండ్‌ స్లామ్‌ ల‌కు దూరం కానుంది. మ‌ళ్లీ టెన్నిస్ రాకెట్ ప‌ట్టేందుకు క‌చ్చితంగా ప్లాన్ చేస్తాన‌ని సెరీనా పేర్కొంది. త‌ల్లి కావ‌డం అనేది జీవితంలో ఒక కొత్త ప్ర‌యాణం మాత్ర‌మే అని, బ‌హుశా త‌న‌కు పుట్ట‌బోయే బేబీ స్టాండ్స్ నుంచి త‌న‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News