బాబు బాల‌కృష్ణ మాట విన‌క త‌ప్ప‌లేదు

Update: 2018-11-12 04:30 GMT
క‌ష్ట‌ప‌డే నేత‌ కంటే కాసులు కురిపించేటోడే బాబుకు ఎక్కువ అన్న నానుడి మ‌రోసారి రుజువైంది. గెలుపు కంటే కూడా డ‌బ్బుకే ప్రాధాన్య‌త ఇస్తూ టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసే అల‌వాటు ఏపీ ముఖ్య‌మంత్రికి అల‌వాటే అన్న విమ‌ర్శ‌కు త‌గ్గ‌ట్లే తాజాగా అలాంటి తీరునే బాబు ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. హాట్ టాపిక్ గా మారిన శేరిలింగంప‌ల్లి టీడీపీ టికెట్‌ ను బాల‌య్య నిర్మాత భ‌వ్యా ఆనంద ప్ర‌సాద్ కు క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌లు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య చివ‌ర‌కు బాల‌య్య మాటే నెగ్గిన‌ట్లుగా స‌మాచారం.

ఏమైనా స‌రే.. త‌న నిర్మాత ఆనంద ప్ర‌సాద్‌ కు పార్టీ టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుప‌ట్టి మ‌రీ బాల‌య్య త‌న మాట‌ను నెగ్గించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌న‌ప్ప‌టికీ శేరిలింగంప‌ల్లి టికెట్ విష‌యంపై బాబు తుది నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. ఆనంద‌ప్ర‌సాద్ కు అన‌ధికారికంగా అధికారిక క‌న్ఫ‌ర్మేష‌న్ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక‌ట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లుగా చెబుతున్నారు.

హైద‌రాబాద్ మ‌హానగ‌ర శివారు నియోజ‌క‌వ‌ర్గ‌మైన శేరిలింగంప‌ల్లి టీడీపీ టికెట్ మువ్వా స‌త్య‌నారాయ‌ణ‌కు ఇస్తాన‌న్న హామీతో ఆయ‌న టీఆర్ ఎస్ నుంచి టీడీపీలోకి చేరారు. వాస్త‌వానికి టీడీపీకి చెందిన మువ్వా 2014లోనూ టికెట్ హామీని బాబు నెర‌వేర్చ‌క‌పోవ‌టంతో ఆయ‌న ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేసి స్వ‌ల్ప వ్య‌త్యాసంతో ఓట‌మిపాల‌య్యారు. అనంత‌రం టీఆర్ ఎస్‌ లో చేరారు. అయితే.. టికెట్ హామీ విష‌యంలో కేసీఆర్ చేతిలోనూ మోస‌పోయిన మువ్వా.. తిరిగి బాబు మాట‌తో టీడీపీలో జాయిన్ అయ్యారు.

మువ్వాకు టికెట్ ప‌క్కా అని.. ఆయ‌న బ‌రిలోకి దిగితే గెలుపు ఖాయ‌మ‌న్న మాట టీఆర్ ఎస్ నేత‌ల నోటి నుంచి సైతం వినిపిస్తున్నా బాబు తాజాగా అందుకు భిన్న‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అభ్య‌ర్థి గెలుపు కంటే కూడా బావ‌మ‌రిది క‌మ్ వియ్యంకుడి మాట‌కు బాబు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. మువ్వాకు టికెట్ ఫైన‌ల్ చేసిన‌ప్ప‌టికీ.. ఆఖ‌రి క్ష‌ణాల్లో జ‌రిగిన ప‌రిణామాల‌తో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బాల‌య్య చెప్పినట్లు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేశార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో టీడీపీ టికెట్ కావాలంటే బాల‌య్య నిర్మాత‌గా మారితే స‌రి అన్న మాట ప‌లువురి నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం.  పార్టీని న‌మ్ముకున్నా.. ప్ర‌జాద‌ర‌ణ ఉన్నా బాబు ద‌గ్గ‌ర లాబీయింగ్.. డ‌బ్బు హ‌వా  మాత్ర‌మే చెల్లుబాటు అవుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News