షర్మిల అరెస్ట్.. దీక్షకు రమ్మని డబ్బులివ్వలేదని కార్మికుల ఆందోళన!

Update: 2021-09-21 10:30 GMT
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్-బోడుప్పల్ లో కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మేడిపల్లి స్టేషన్ కు తరలించారు. ఈ ఉదయం నిరుద్యోగ దీక్ష చేసేందుకు బోడుప్పల్ కు షర్మిల వచ్చారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య దీక్ష చేసేందుకు వైఎస్ షర్మిల యత్నించగా ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల మంది నిరుద్యోగులను హత్య చేసిన హంతకుడు కేసీఆర్ అని.. ఏళ్లుగా నిద్రపోయి ఇప్పుడు గర్జనలు అటూ ప్రతిపక్షాల ముందుకు వస్తున్నాడని నిప్పులు చెరిగారు.

ఇక రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ లో ఒక నిరుద్యోగి చనిపోతే కనీసం పరామర్శించరా? రేవంత్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు చేదు అనుభవం ఎందురైంది. షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వలేదని అడ్డాకూలీలు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఆందోళనకు దిగడం సంచలనమైంది. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వలేదని వారు దీక్ష స్థలి వద్దే నిరసన తెలిపారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. తీరా వచ్చాక డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు.

మంగళవారం వైఎస్ షర్మిల చేపట్టనున్న నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం గమనార్హం.  ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా షర్మి దీక్ష చేపడుతోంది. ఈసారి మాత్రం పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆమెను అరెస్ట్ చేయడం గమనార్హం.

ఇక వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్టు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. అక్టోబర్ 20 నుంచి ఆమె పాదయాత్ర చేవేళ్లలో ప్రారంభించనుంది.  నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగిస్తామన్నారు.
Tags:    

Similar News