భేటికి ముందే అమిత్ షాకు పంచ్ ఇచ్చిన శివసేన

Update: 2018-06-06 11:28 GMT
బలం ఉన్నప్పుడు ఒకలా.. బలం లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తే.. పాత గాయాలు మానవని శివసేన నిరూపించింది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతున్న వేళ బీజేపీలో కూడా అంతర్మథనం మొదలైన సంగతి తెలిసిందే.. బీజేపీ కూడా తనకు దూరమైన, దూరమవుతున్న పార్టీలను తిరిగి ఒక్కటి చేసేందుకు ‘సంపర్క్ ఫర్ సమర్ధన్’ అంటూ మద్దతు కూడగట్టేందుకు బయలు దేరింది. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ చీఫ్ అమిత్ షా ముంబైలో శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో భేటి అవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు శివసేన పత్రికలో బీజేపీపై ఘాటు విమర్శలకు దిగింది శివసేన పార్టీ..

అమిత్ షా హడావుడిగా ఎన్టీఏ మిత్రపక్షాలతో భేటి అవుతుండడాన్ని సామ్నా పత్రికలో విమర్శించారు. ఎందుకు బీజేపీ పెద్దలు సమావేశం అవుతున్నారో చెప్పాలని నిలదీసింది. లోక్ సభ, అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పైన సామ్నాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఉప ఎన్నికల్లో శివసేన సత్తా చాటడంతో బీజేపీకి తత్వం బోధపడి ఇలా స్నేహం కోసం అర్రులు చాస్తోందని తన పత్రికలో శివసేన పెద్ద వ్యాసం రాసింది. ప్రధాని మోడీ ప్రపంచదేశాల పర్యటనలో ఉన్నారని.. అమిత్ షా దేశ పర్యటనలో ఉన్నారని.. ఇలా బీజేపీ అంతర్జాతీయ ప్రచారం మొదలు పెట్టిందని శివసేన ఎద్దేవా చేసింది.

ఇలా బీజేపీ చీఫ్ అమిత్ షా తమను కలవడానికి ముందే శివసేన పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని తెగేసి చెప్పింది. ఈ పరిణామాలతో ఎన్నో ఆశలతో పర్యటన పెట్టుకున్న అమిత్ షాకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
Tags:    

Similar News