మోడీకి షాకిచ్చిన చిర‌కాల మిత్రుడు

Update: 2018-01-23 09:53 GMT
జాతీయ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసే కీల‌క ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. బీజేపీకి నిజ‌మైన మిత్ర‌ప‌క్షంగా నిలిచి వివాదాల్లోనూ వెన్నంటి న‌డిచిన శివ‌సేన పార్టీ తెగ‌తెంపులు చేసుకుంది. బీజేపీని ఒక అంట‌రాని పార్టీగా చూస్తూ.. ఆ పార్టీకి మ‌ద్దతు ఇవ్వ‌టం అంటేనే.. సెక్యుల‌రిజాన్ని తాక‌ట్టు పెట్టిన‌ట్లుగా ఫీల‌య్యే రోజుల్లో బీజేపీ వెంటే ఉన్న శివ‌సేన తాజాగా మాత్రం త‌మ ఫ్రెండ్ షిప్ ను క‌ట్ చేసుకుంది.

అంతేకాదు.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లతో పాటు.. మ‌హారాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది. బీజేపీతో దోస్తీ ఇక‌పై కొన‌సాగ‌ద‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తాజాగా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ భేటీలో ఆ పార్టీ చీఫ్ తేల్చేశారు.

బీజేపీని ఎప్పుడైతే మోడీ అండ్ కో లీడ్ చేస్తున్నారో అప్ప‌టి నుంచి సేన‌కు.. బీజేపీకి ఏ మాత్రం పొస‌గ‌టం లేదు. త‌మ‌ను సైడ్ చేస్తున్న మోడీపై సేన త‌న ఆగ్ర‌హాన్ని దాచుకోలేదు. సేన‌ను వ‌దిలించుకోవాల‌న్న‌ట్లుగా బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం వ్య‌వ‌హ‌రించింద‌న్న అభిప్రాయం కూడా ప‌లువురు వ్య‌క్తం చేస్తుంటారు.

మ‌హారాష్ట్రలో బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా.. అది క‌ల‌హాల కాపుర‌మే త‌ప్పించి ఇరు పార్టీల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌ని ప‌రిస్థితి.  కేంద్రంలో మోడీ స‌ర్కారు మీద త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేస్తున్న సేన‌.. మోడీ పంటి కింద రాయిగా మారారు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా బీజేపీతో క‌టీఫ్ చెబుతూ శివ‌సేన నిర్ణ‌యం తీసుకోవ‌టం కీల‌క ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

బీజేపీతో దోస్తీపై నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని.. అందుకే క‌టీఫ్ నిర్ణ‌యాన్ని తీసుకున్నట్లు ఉద్ద‌వ్ ఠాక్రే వెల్ల‌డించారు. సేన క‌టీఫ్ నిర్ణ‌యాన్ని బీజేపీలోని సంప్ర‌దాయ వ‌ర్గం వ్య‌తిరేకిస్తోంది. ఎప్ప‌టి నుంచో త‌మ‌తో న‌డిచిన సేన‌ను వ‌దులుకోవ‌టం స‌రికాద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ఇలాంటి వారి వాయిస్ కు మోడీ షా నేతృత్వంలోని బీజేపీలో విలువ లేక‌పోవ‌టం తెలిసిందే.

Tags:    

Similar News