మహారాష్ట్రలో కమలనాథులకు షాకుల మీద షాకులు

Update: 2021-03-19 10:30 GMT
బలమే కాదు బలహీనతలు కూడా అలవాటుగా మారుతుంటాయి. దేశంలోని ఏ రాష్ట్రమైనా (తమిళనాడు.. ఏపీ లాంటివి మినహాయిస్తే) సరే.. తాము టార్గెట్ చేశామంటే చాలు.. అక్కడ అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించకుండా పవర్ ను సొంతం చేసుకోవటం కమలనాథులకు అలవాటు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇదే విషయాన్ని నిరూపించుకున్న బీజేపీ.. మహారాష్ట్రలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మొన్నటివరకు తిరుగులేని అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చిరకాల మిత్రుడు శివసేనతో విభేదించిన నాటి నుంచి కమలనాథులకు కష్టాలు మొదలయ్యాయి.

తనకే మాత్రం పొసగని కాంగ్రెస్.. ఎన్సీపీతో జత కట్టిన శివసేన.. తన బలాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతుంటే.. అందుకు భిన్నంగా బీజేపీకి మాత్రం వరుస పెట్టి షాకులు తగులుతున్నాయి. నెల వ్యవధిలో ఆ పార్టీకి రెండుషాకులు తగిలాయి. గత నెలలో సంగ్లి నగర మేయర్ పదవిలో ఉన్న బీజేపీకి బదులుగా.. శివసేన చేతికి పీఠం దక్కింది. తాజాగా జలగాంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈరెండు చోట్ల బీజేపీకి అధిక్యత ఉన్నా.. మారిన రాజకీయ సమీకరణాలతో అధికారాన్ని చేజార్చుకుంటోంది.

తాజాగా జలగాంలో జరిగిన బలపరీక్షలో బీజేపీకి చెందిన 31 మంది కార్పొరేటర్లు శివసేనకు ఫిరాయించటంతో ఇప్పుడక్కడ సేన.. పవర్లోకి వచ్చేసిన పరిస్థితి. జలగాంలో 75 మంది కార్పొరేటర్లు ఉంటే.. శివసేనకు కేవలం 15 మంది మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. అయితే.. తాజాగా 31 మంది బీజేపీ కార్పొరేటర్లు సేనలోకి వచ్చేయటం.. మజ్లిస్ తనకున్న ముగ్గురు కార్పొరేటర్ల మద్దతుతో జలగాం కార్పొరేషన్ సేన వశమైంది. గత నెలలో జరిగిన సంగ్లి మేయర్ పదవిని ఎన్సీపీ సొంతం చేసుకుంటే.. తాజాగా జలగాం కార్పొరేషన్ సేన సొంతమైంది. రానున్న రోజుల్లో మరెన్ని షాకులు తగులుతాయో?
Tags:    

Similar News