మాస్కు పెట్టుకోవటం లేదెందుకు అని అడిగిన సర్వే ఫలితం వింటే షాకే

Update: 2021-07-14 03:23 GMT
ఫేస్  మాస్కు అదేనండి.. మూతి గుడ్డ ఇప్పుడు జీవితంలో ఒక భాగమైంది. కరోనా ముందు వరకు.. ముఖానికి మాస్కు పెట్టటమంటే.. అది డాక్టర్ అయినా అయి ఉండాలి లేదంటే వైద్యరంగానికి చెందిన వారో.. లేదంటే సైంటిస్టో అయి ఉండాలి. లేదంటే రోగి అయినా అయి ఉండాలి. అంతకు మించి.. మరెవరూ మాస్కు పెట్టినా విచిత్రంగా చూసే పరిస్థితి. కొవిడ్ మహమ్మారి దెబ్బకు అదంతా పోయి.. మాస్కు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. ఒకవేళ.. వచ్చినా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాంటి ఫైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని జరిమానాల షాకు ఇస్తున్నాయి. ఇలాంటి వేళలోనూ ముఖానికి మాస్కు పెట్టుకోకుండా దైనందిక కార్యకలాపాల్ని చేపట్టే వారు కొందరు కనిపిస్తుంటారు.

కొవిడ్ కు చెక్ పెట్టటంలో కీలకభూమిక పోషించే మూడు ప్రధాన అంశాల్లో మొదటిది ముఖానికి మాస్కు పెట్టుకోవటం. దీన్ని పక్కాగా ఫాలో అయిన వారిలో 90 శాతం వరకు కరోనా బారిన పడే ప్రమాదాన్ని తప్పించుకునే వీలుంది. అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ.. ముఖానికి మాస్కు పెట్టుకోకుండా వ్యవహరిస్తూ నెత్తి మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతకీ మాస్కు ఎందుకు పెట్టుకోరు? దానికి కారణం ఏమిటి? ఏ అంశాలు ముఖానికి మాస్కు పెట్టుకోనివ్వకుండా ప్రభావితం చేస్తున్నాయన్న అంశాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ తానే స్వయంగా రంగంలోకి దిగింది.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. మాస్కు పెట్టుకోకపోవటానికి సర్వేలో వెల్లడైన అంశాలన్ని చాలా సిల్లీగా ఉండటం గమనార్హం. మాస్కులు పెట్టుకోకపోవటానికి ప్రధాన కారణం.. ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు. మాస్కులు అసౌకర్యంగా ఉండటం కూడా మరో ప్రధాన కారణంగా చెబుతుండటం గమనార్హం.

అంతేకాదు.. భౌతిక దూరం పాటిస్తే కరోనా ముప్పు ఉండదని.. అందుకే తాము మాస్కులు పెట్టుకోవటం లేదని చెప్పటం విశేషం. అంతేకాదు.. మాస్కులు ధరించటం అసౌకర్యంగా ఉందని మరికొందరు చెబుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సర్వే వెల్లడించింది. మాస్కులు ధరించినప్పటికి కొవిడ్ ను అడ్డుకోవటం లేదంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని పలువురు నిపుణులు తప్పు పడుతున్నారు. కొవిడ్ నిబంధనల్ని పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. నిబంధనల్ని అమలు చేయటంలో ఏ మాత్రం తేడా వచ్చినా మూడో వేవ్ ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.

ఇక.. మూడో వేవ్ మీద కూడా సర్వేలో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. చాలామంది మూడో వేవ్ ను వాతావరణ శాఖ విడుదల చేసే నివేదికలుగా భావిస్తూ.. కొట్టి పారేస్తున్నారని.. పెద్దగా పట్టించుకోవటం లేదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మూడో వేవ్ మీద  కేంద్రం చేస్తున్న హెచ్చరికల్ని చాలామంది పట్టించుకోవటం లేదన్న విషయం తాజా సర్వే వివరాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ తరహా వైఖరితోనే సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు. సెకండ్ వేవ్ ను ప్రజలు మాత్రమే కాదు.. ప్రభుత్వాలు సైతం సిద్ధం కాకపోవటం.. తీవ్రత అంతగా ఉంటుందన్న అంచనాలు లేకపోవటం కూడా దారుణ పరిస్థితులకు కారణమైందని చెప్పక తప్పదు. సెకండ్ వేవ్ అనుభవంతో అయినా.. మూడో వేవ్ విషయంలో అప్రమత్తత చాలా అవసరం. లేకుంటే.. మరిన్ని చేదు అనుభవాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరీ.. హెచ్చరికలు ఏంత మేర పని చేస్తాయో చూడాలి.
Tags:    

Similar News