కేసీఆర్ మీద రిటైర్డు జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు

Update: 2021-12-20 05:01 GMT
సూర్య హీరోగా నటించిన ‘జైభీం’ చిత్రం రియల్ హీరోగా అందరి మన్ననలు పొందుతున్న రిటైర్డు హైకోర్టు జడ్జి చంద్రు మరోసారి వార్తల్లోకి వచ్చారు. జైభీమ్ సినిమా నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. అప్పటివరకు ఆయన గురించి వివరాలు.. సాధించిన ఘనతలు కొందరికే పరిమితం కాగా.. ఈ సినిమా పుణ్యమా అని అందరికి తెలిసిపోయారు. విపరీతమైన పాపులార్టీ వచ్చింది కూడా. అలాంటి ఆయన.. ఈ మధ్యనే ‘ది హిందూ’లో రాసిన ఆర్టికల్.. అనంతరం విజయవాడలో జరిగిన మానవ హక్కుల సంఘం సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి.

న్యాయవ్యవస్థ మీద ఆయన చేసిన వ్యాఖ్యలతో అప్పటివరకు ఆయన్ను అభిమానించిన వారు సైతం విభేదించటం మొదలు పెట్టారు. అప్పటివరకు ఆయన్నో రియల్ హీరోగా పొగిడేసిన వారు సైతం.. ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరి ప్రభావానికి గురై చేసినట్లుగా విమర్శలు చేయటం షురూ చేశారు. ఇలాంటి వేళ ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం కోసం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు.

మద్రాసు మాజీ హైకోర్టు జడ్జిగా వ్యవహరించిన చంద్రు.. మానవ హక్కుల కార్యకర్తగా మంచి పేరుంది. అలాంటి ఆయన ఏపీలోని రాజకీయ పరిణామాల మీద మాట్లాడటం ద్వారా ఒక్కసారిగా కాంట్రావర్సీ కావటం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆయన చేసిన విమర్శలు కాసింత ఘాటుగానే ఉన్నాయని చెప్పాలి. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మికులను సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి బెదిరించటం అప్రజాస్వామికమన్నారు. అలాంటి వ్యవహారశైలి ఉన్న వ్యక్తుల అధికారం ఎక్కువ కాలం నిలవదన్నారు.

తమిళనాడులో సమ్మె చేసిన 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను నాటి సీఎంగా వ్యవహరించిన జయలలిత సస్పెండ్ చేసిన ఉదంతంతో కేసీఆర్ ను పోల్చటం గమనార్హం. జైభీం సినిమా తనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టిందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తనను పలువురు పిలుస్తున్నారన్నారు. నిజానికి జైభీం సినిమాకు తాను హీరో కాదని.. నాటి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా సంచలనాత్మక తీర్పును వెలువరించిన జస్టిస్ మిశ్రాయే అసలైన హీరోగా అభివర్ణించారు.

జైభీం సినిమాలో పోలీసుల టార్చర్ ను పది శాతం మాత్రమే చూపించారని పేర్కొన్నారు. దేశంలోని సినిమా సెన్సార్ బోర్డులన్నీ ఆర్ఎస్ఎస్.. బీజేపీ వందిమాగదులతో నించినట్లుగా ఆరోపించారు. శనివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ.. జిల్లా కోర్టు న్యాయమూర్తుల సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరు కావాల్సి ఉందని.. కానీ వాటికి పోలీసులు చివరి నిమిషాల్లో అనుమతుల్ని రద్దు చేశారన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం.. ఆయన్ను జగన్ వర్గానికి చెందిన వ్యక్తిగా కొందరు అభివర్ణించటం తెలిసిందే.

దీనిపై స్పందించిన ఆయన.. తాను చంద్రబాబు పక్షమో.. జగన్మోహన్ రెడ్డి పక్షమో తాను కాదన్నారు. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు.. ఉత్తరాంధ్ర.. రాయలసీమ ప్రాంతాల వారితో పాటు.. మిగిలిన వారి అభిప్రాయాల్ని విని.. సమన్యాయం అందించేందుకు ప్రయత్నించాలన్నారు. ఇదే విషయాన్ని తాను చెప్పానని.. అంతకు మించి తాను ఈ విషయం మీద మాట్లాడేదే లేదన్నారు. ఏపీలో ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారితే.. తెలంగాణ సీఎంపై తాజాగా చేసిన విమర్శలు మరోసారి ఆయన్ను హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News