‘గాంధీ’లో గ్యాంగ్ రేప్.. ఒక మహిళ ఇప్పటికి కనిపించట్లేదు

Update: 2021-08-17 03:39 GMT
హైదరాబాద్ మహానగర రాజధాని నడిబొడ్డున ఉన్న గాంధీ దవాఖానాలో వైద్యం కోసం వచ్చిన వ్యక్తికి సహాయకులుగా వచ్చిన భార్య.. ఆమె సోదరిని బంధించి గ్యాంగ్ రేప్ చేసినట్లుగా వెలుగు చూసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. నోట మాట రాని విధంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో మరికొన్ని అంశాలపై ఇప్పటికి స్పష్టత లేకపోవటం.. బాధితులుగా చెబుతున్న మహిళల్లో ఒకరి ఆచూకీ ఇప్పటికి లభించకపోవటం.. మరో మహిళ గాంధీ ఆవరణలోని తుప్పల్లో   బట్టల్లేకుండా పడిపోవటం లాంటి వైనం ఇప్పుడు సంచలనం గా మారింది. నిత్యం రద్దీగా ఉంటూ.. ప్రతి చోట సీసీ కెమేరా ఉందని చెప్పే ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందన్న వివరాల్లో వెళితే..

మహబూబ్ నగర్ కు చెందిన ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉండటంతో గాంధీ ఆసుపత్రిలో చూపించేందుకు నగరానికి వచ్చారు. రోగితో పాటు సహాయకులుగా భార్య.. అతని సోదరి కూడా ఉన్నారు.  రోగికి వైద్యం చేయిస్తున్న వేళ.. మాయమాటలు చెప్పి.. మత్తు మందు ఇచ్చి ఆసుపత్రిలోని సెల్లార్ లో ఉంచి తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా బాధితురాలు వాపోయింది. షాకింగ్ అంశం ఏమంటే.. అక్కాచెల్లెళ్లు ఇద్దరిని వేర్వేరుగా బంధించినట్లుగా నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో రోగి భార్య ఆచూకీ ఇప్పటికి వెల్లడి కాలేదు. రోగి భార్య చెల్లెలు మాత్రం బట్టల్లేకుండా గాంధీ ఆసుపత్రి వెనుక ఉన్నతుప్పల్లో  పడి ఉన్న వైనాన్ని అక్క కొడుకు.. అతడికి గాంధీలో పరిచయం ఉన్న ఉద్యోగి ఉమామహేశ్వరరావు సాయంచేశారు. ఈ గ్యాంగ్ రేప్ కు సంబంధించి కీలక నిందితుడిగా ఉమామహేశ్వర్ ఉన్నారు. బాధితురాలు ఇచ్చినఫిర్యాదులోనూ తమకు మాయమాటలు చెప్పి.. మత్తు మందు ఇచ్చి రూంలో బంధించింది ఉమామహేశ్వర్ గా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉమామహేశ్వరరావు పోలీసుల అదుపులో ఉన్నారు. అతడ్ని విచారిస్తున్నారు. ఆగస్టు నాలుగున గాంధీ ఆసుపత్రికి రాగా.. అతడికి సహాయకులుగా వచ్చిన ఇద్దరు మహిళలకు గాంధీలోని రేడియాలజీ డిపార్ట్ మెంట్ లో డార్కు రూమ్ అసిస్టెంట్ గా పని చేసే ఉమామహేశ్వర్ అనే వ్యక్తి వారికి బంధువుగా చెబుతున్నారు. అతడి సహకారంతోనే రోగిని ఆసుపత్రిలో చేర్చారు. ఆగస్టు ఏడో తేదీ నుంచి రోగికి సహాయకులుగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు పేషెంట్ వద్దకు వెళ్లట్లేదు. ఆగస్టు 9న పేషెంట్  కొడుకు గాంధీకి వచ్చాడు. తల్లి.. పిన్ని ఆగస్టు 7నుంచి తన తండ్రి వద్దకు రావట్లేదని తెలిసింది. వారి ఆచూకీ కోసం ఎంతగా గాలించినా సమాచారం లభించలేదు. దీంతో.. 11న తండ్రిని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు.

ఆదివారం ఉమామహేశ్వర్ (ఆగస్టు 14న) ఫోన్ చేసి.. ఆసుపత్రి వెనుక భాగంలో దుస్తులు లేని స్థితిలో మీ పిన్ని ఉందని చెప్పటంతో వెంటనే అక్కడకు చేరుకన్నాడు. తాను వెళ్లే సమయానికి తుప్పల్లో అపస్మాకర స్థితిలో దుస్తులు లేని స్థితిలో తన పిన్నిని చూసినట్లుగా రోగి కుమారుడు పోలీసులకు చెప్పాడు. తన తల్లి ఆచూకీ గురించి అడిగితే.. తనకు తెలీదని సదరు మహిళ చెప్పినట్లుగా సమాచారం. ఆమె తేరుకుంటే అన్ని వివరాలుతెలుస్తాయన్న ఉద్దేశంతో ఆమెను ఊరికి తీసుకెళ్లారు.

సోమవారం బాధిత మహిళ..తనపై ఐదారుగురు వరకు అత్యాచారానికి పాల్పడ్డారని.. జేబురుమాలలో మత్తుమందు స్ప్రే చేసి నోటికి అదిమి పెట్టారని.. అనంతరం సెల్లార్ లోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆమె మహబూబ్ నగర్ పోలీసులకు ఫోన్ లో ఫిర్యాదు చేయగా.. ఈ కేసు తమ పరిధిలోకి రాదని చెప్పి.. గాంధీ ఆసుపత్రి పరిధిలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ల లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారు.

దీంతో.. బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వచ్చి తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెప్పింది. దీంతో ఆమెను భరోసా కేంద్రానికి పంపి.. అక్కడ స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉమామహేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మరికొందరు రేప్ చేశారని..వారిని తాను గుర్తించగలనని చెప్పినట్లు తెలిసింది. బాధితురాలి అక్క ఆచూకీ కోసం నాలుగు టీంలను సిద్ధం చేశారు. బాధితురాలు విచారణకు సరిగా సహకరించట్లేదని.. ఈ కేసులో కొన్ని అనుమానాలు ఉన్నాయని.. తప్పిపోయిన మహిళ ఆచూకీ లభిస్తే..మరింత సమాచారం వస్తుందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు గడిచిన ఐదు రోజులుగా ఉమామహేశ్వర్ విధులకు సరిగా హాజరు కావట్లేదని చెబుతన్నారు. ఈ ఉదంతం తన వరకు వచ్చినంతనే విచారణ కమిటీ వేసినట్లుగా గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు వెల్లడించారు. ఈ కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. బాధితురాలి ఆచూకీ లభిస్తే.. చాలా చిక్కుముడులు వీడే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News