సోమిరెడ్డికి షాకిచ్చిన తమ్ముళ్ళు

Update: 2022-06-10 07:30 GMT
తెలుగుదేశంపార్టీ కడప ఇన్చార్జి హోదాలో మీటింగ్ పెట్టిన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆ జిల్లా నేతలు పెద్ద షాకే ఇచ్చారు. స్ధానికంగా ఉన్న హోటల్లో సీనియర్ నేతలు, పార్లమెంటు ఇన్చార్జిలతో సోమిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీలో చేరికలపై చర్చ చాలా హాటుహాటుగా జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి పనిచేసి ఇంతకాలం అధికార వైసీపీలో ఉన్న నేతలు వస్తే ఇప్పటికిప్పుడు వాళ్ళని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటు మండిపడ్డారు.

మొదటి కమలాపురం ఇన్చార్జి, వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంఎల్ఏ వీరశివారెడ్డి టీడీపీలో చేరికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

లోకేష్, చంద్రబాబునాయుడును కలిసిన తర్వాత శివారెడ్డి మాట్లాడుతూ తాను తొందరలోనే పార్టీలో చేరబోతున్నట్లు చేసిన ప్రకటనను పుత్తా ప్రస్తావించారు. శివారెడ్డి వల్ల పార్టీ నష్టపోవటం ఖాయమన్నారు. అలాగే తన నియోజకవర్గంలో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి జోక్యం పెరిగిపోతోందంటు మండిపోయారు.

అలాగే మైదుకూరులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని ఎలా చేర్చుకుంటారంటు ఇన్చార్జి సుధాకర్ యాదవ్ రెచ్చిపోయారు. తమకు మాటమాత్రం కూడా చెప్పకుండానే డీఎల్ తో పార్టీ సీనియర్లు ఎలా టచ్ లో ఉంటున్నారంటు నిలదీశారు. డీఎల్ వల్ల పార్టీలో అయోమయం పెరిగిపోతోందన్నారు. ఆయనతో కలిసి పనిచేయటానికి ఎవరూ సిద్ధంగాలేరని కూడా చెప్పారు.

చివరగా ప్రొద్దుటూరులో మాజీ ఎంఎల్ఏ వరదరాజులరెడ్డి విషయాన్ని ఇన్చార్జి, మాజీ ఎంఎల్ఏ లింగారెడ్డి లేవనెత్తారు. తమకు తెలీకుండానే వరదరాజులరెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటు సోమిరెడ్డిని నిలదీశారు.  పార్టీకి వరదరాజులు చేసిన డ్యామేజీని పార్టీ నాయకత్వం మరచిపోయిందా అంటు సూటిగా నిలదీశారు.

ఇంతకాలం అధికారపార్టీలో ఉంటు అక్కడ చెల్లుబాటు కామని అర్ధమైనతర్వాతే వాళ్ళు  టీడీపీలోకి వస్తున్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఇలాంటివారిని చేర్చుకుంటే పార్టీకి తీరని నష్టం తప్పదని కూడా హెచ్చరించారు. పార్టీనుండి వచ్చిన హెచ్చరికలు, ప్రశ్నలు తదితరాలతో సోమిరెడ్డికి పెద్ద షాక్ తగిలినట్లే అయ్యింది.
Tags:    

Similar News