ఏపీ పరిషత్ పోలింగ్: షాకింగ్ ట్విస్ట్

Update: 2021-04-08 03:49 GMT
ఏపీ వ్యాప్తంగా గురువారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు గాను అన్ని జిల్లాల్లో కలిపి 27751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి ప్రారంభమైన పోలింగ్ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

అయితే అనూహ్య రీతిలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద కోటియా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ ఏపీ ప్రభుత్వానికి సవాలుగా మారింది.  ఆంధ్రా-ఒడిశా మధ్య విజయనగరం-కోరాపుట్ జిల్లాల మధ్యలో ఉంటే కొటియా గ్రూపు గ్రామాలపై దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతోంది. ఆ గ్రామాలు మా వంటే మావి అంటూ సుప్రీంకోర్టుకు కూడా రెండు ప్రభుత్వాలు ఎక్కాయి. ఈ వివాదం సమయంలోనే ఏపీ పరిషత్ ఎన్నికలను కోటియా గ్రామాల్లో జరగకుండా ఒడిశా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏకంగా 22 కోటియా గ్రామాల్లో బుధవారం నుంచే సెక్షన్ 144 విధించి.. జనం కదలికలపై ఆంక్షలు పెట్టింది.

పోలింగ్ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక అధికారులు, ఐటీడీఏ పీవో రంగంలోకి దిగి ఒడిశా యంత్రాంగంతో చర్చలు జరిపారు.

పరిషత్ ఎన్నికలు జరుగకుండా కొరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అక్తర్ ఆదేశాల మేరకు 22 కోటియా గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. గ్రామస్థులను ఏపీకి వెళ్లకుండా ఒడిశా అధికారులు ఆంక్షలు విధించారు.

కాగా వివాదాస్పద కోటియా గ్రామాల్లో ఇరు రాష్ట్రాలు ఎన్నికలను నిర్వహిస్తున్నాయి. ఒక రాష్ట్రం ఎన్నికలను మరో రాష్ట్రం ఎప్పుడూ అడ్డుకోలేదు. తొలిసారి ఏపీ స్థానిక ఎన్నికలపై ఒడిశా కన్నెర్ర చేస్తోంది.
Tags:    

Similar News