అషాఢం అయిపోయింది.. చంద్రుళ్లకు షాకులేనా?

Update: 2019-08-03 11:30 GMT
అషాఢం పూర్తి అయ్యింది. శ్రావణం వచ్చేసింది. ఇప్పటివరకూ మంచి రోజులు లేవన్న ఉద్దేశంతో మంచి ముహుర్తం కోసం వెయిట్ చేస్తున్న ఎంతో మంది నేతలు తమ అధినేతలకు షాకిచ్చే ప్రక్రియకు తెర తీస్తారని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని చూసుకున్న మోడీషాలకు దక్షిణాదిన పాగా వేయటానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉందన్న విషయాల్ని గుర్తించారు. వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా తమ బలాన్ని పెంచుకోవాలన్న ఆశలో ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాల్ని చేజిక్కించుకోవటం.. దీనికి తోడు సీఎం కుమార్తె.. సిట్టింగ్ ఎంపీని ఓడించటం లాంటి సంచలన విజయాలతో తెలంగాణలో తమకున్న అవకాశాల మీద మరింత లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేయాలని మోడీషాలు డిసైడ్ అయ్యారు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్ని అసరా చేసుకుంటే.. తాము ప్రత్యామ్నంగా మారటమే కాదు.. అధికారపక్షం మీద ఉన్న వ్యతిరేకత తమకు లాభంగా మారటమే కాదు.. అధికారానికి కూడా చేరువు చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఏపీలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. బలమైన అధికారపక్షం కారణంగా అధికారం కంటే కూడా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజాదరణ ఉన్న టీడీపీ నేతల్ని పార్టీలోకి తీసుకోవటం ద్వారా పార్టీని పటిష్టంగా చేయటం.. రానున్న రోజుల్లో అధికార పక్షానికి ప్రత్యమ్నాయంగా మారాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అషాడ మాసంలో పార్టీలోకి తమ్ముళ్ల జాయినింగ్ సరికాదన్న ఉద్దేశంతో ఆగినట్లుగా చెబుతున్నారు.  శ్రావణంలో మంచి ముహుర్తాలు ఉండటంతో అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ ఇద్దరు చంద్రుళ్లకు షాకిచ్చేలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. చూస్తుంటే.. శ్రావణంలో చంద్రుళ్ల ఇద్దరికి షాకులు తప్పేలా లేవుగా?
Tags:    

Similar News