సిద్ధరామయ్య పై వేటు?

Update: 2019-06-14 01:30 GMT
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ బలంగా ఉన్న కర్ణాటకలో కూడా ఈసారి బోల్తా పడింది. బీజేపీ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కలిసి పోటీ చేసినా.. చెరో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలో ఎన్నికల్లో వైఫల్యాలకు గల కారణాలను అంచనా వేసిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్ణాటకలో భారీ ప్రక్షాళన చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జి కేసీ వేణుగోపాల్‌ ను తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయన కూడా ఇప్పటికే రాహుల్‌ గాంధీ వద్ద వాపోయినట్లు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్‌ తన మాట వినడం లేదని.. తనకు కర్ణాటక బాధ్యతలు తలనొప్పిగా మారాయని రాహుల్‌గాంధీకి విన్నవించినట్లు తెలిసింది. అదేవిధంగా సీనియర్‌ నేత మల్లికార్జునఖర్గేను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుంటారని సమాచారం. ఉత్తర కర్ణాటకకు చెందిన మంత్రి ఎంబీ పాటిల్‌ కు రాష్ట్ర బాధ్యతలు అప్పజెబుతారనే ప్రచారం కూడా సాగుతోంది.

 కాంగ్రెస్‌ అధిష్టానం సూచన ప్రకారం 2009లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లికార్జునఖర్గే.. తర్వాత కాలంలో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగారు. ఆ సమయంలో కర్ణాటకలో సిద్ధరామయ్య తనదైన పాత్ర పోషించారు. అయితే తాజాగా సిద్ధరామయ్య వైఖరిపై పలు ఫిర్యాదులు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. సిద్ధరామయ్య వైఖరి కారణంగానే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందనే ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సిద్దూను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా రాష్ట్ర రాజకీయాల బాధ్యతలను మల్లికార్జునఖర్గేకు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. మల్లికార్జున ఖర్గే తాజా ఎన్నికల్లో కలబుర్గి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

 కర్ణాటక కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా ప్రసిద్ధి చెందిన హోంమంత్రి ఎంబీ పాటిల్‌ కు రాష్ట్ర కాంగ్రెస్‌ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. బీజేపీకి లింగాయత్‌ సముదాయానికి చెందిన బీఎస్‌ యడ్డూరప్ప నేతృత్వం వహిస్తున్నారు. ఈనేపథ్యంలో అదే రీతిలో లింగాయత్‌ ఓట్లను రాబట్టాలంటే అదే సముదాయానికి చెందిన వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా హోంమంత్రి ఎంబీ పాటిల్‌ పేరు పరిశీలనలోకి వచ్చింది. అంతేకాకుండా ఉత్తర కర్ణాటకలో ప్రత్యేక గ్రూపు ఏర్పాటు కాకుండా ఉండాలంటే ఆ ప్రాంత వాసులకు పార్టీ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. ఫలితంగా మల్లికార్జునఖర్గే - ఎంబీ పాటిల్‌ కు పార్టీ బాధ్యతలు త్వరలోనే అప్పజెబుతారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత - మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పలువురు సీనియర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయనను తప్పించాలని భావిస్తున్నారు. అదేవిధంగా నిత్యం ట్వీట్ల సమరంలో వార్తల్లోకెక్కే దినేశ్‌ గుండూరావును కూడా కేపీసీసీ బాధ్యతల నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే కర్ణాటకలో కాంగ్రెస్‌ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలంటే ఉన్న వారికి పదవులు ఇస్తే సరిపోతుంది.. కానీ కొందరిని తప్పిస్తే ప్రమాదమే అంటున్నారు.



Tags:    

Similar News