నిండా ముంచేసి - ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా!

Update: 2019-12-09 13:02 GMT
కర్ణాటకలో కూటమి ప్రభుత్వం పడిపోవడానికి కారణమే సిద్ధరామయ్య అనే ప్రచారం ఒకటి ఉంది. దేవేగౌడ కుటుంబంతో సిద్ధరామయ్యకు ఏ మాత్రం పొసగదు. గతంలో సిద్దూ కూడా జేడీఎస్ లో పని చేసిన వ్యక్తే. ఉపముఖ్యమంత్రిగా సైతం వ్యవహరించారు. అయితే జేడీఎస్ లో ఉంటే తనకు సీఎం అవకాశం రాదని ఫిక్సయ్యి, సిద్ధరామయ్య కాంగ్రెస్ లో చేరారు. కురుబ కోటాలో కాంగ్రెస్ లో ఆయనకు మంచి అవకాశం లభించింది. సీఎం సీటు కూడా దక్కింది.

ఐదేళ్లూ సీట్లో కూర్చున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుకుని ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వివిధ పరిణామాల్లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది. కుమారస్వామికి సీఎం పీఠం దక్కింది. అది కుమారస్వామికి నచ్చలేదు. పాత విబేధాలకు తోడు.. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తనను ఒక సీట్లో ఓడించిందనే అంశాన్ని ఆయన తీవ్రంగా తీసుకున్నారంటారు.

అందుకే కుమారస్వామి సీఎంగా ఉన్న ప్రభుత్వాన్ని కూల దోసే వరకూ సిద్ధరామయ్యకు నిద్రపట్టలేదంటారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సిద్ధరామయ్యే వ్యూహం పన్నారని, ఇగో క్లాషెస్ తో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆయనే కృషి చేశారని అంటారు.

అలా ప్రభుత్వం పడిపోవడం, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తిరగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఆపై ఉప ఎన్నికలు, ఇప్పుడు ఫలితాలు అన్నీ చకచకా జరిగాయి. ఉప ఎన్నికల్లో విజయంతో బీజేపీ ప్రభుత్వం స్థిరపడింది. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య సీఎల్పీ నేత పదవికి రాజీనామా చేశారు. ఓటమికి తనదే బాధ్యత అని ఆయన ప్రకటించుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ను నిండా ముంచేసి ఇప్పుడు ఈ మాజీ సీఎం రాజీనామా అంటూ కామెడీలు చేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News