చెట్టును కొట్టించిన టీచర్ కు సిద్దిపేట్ కమిషనర్ షాక్ మామూలుగా లేదుగా?

Update: 2021-05-26 07:30 GMT
మొక్కే కదా అని పీకేస్తే.. అంటూ ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన వార్నింగ్ ఆ మూవీలోని హైలెట్ సీన్లలో ఒకటి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అన్న కార్యక్రమాన్ని చేపట్టటం.. మొక్కల పెంపకానికి విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటమే కాదు.. చెట్లను ఎవరైనా తొలగించినా.. కొట్టివేసినా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా సిద్దిపేటలో జరిగిన ఒక ఉదంతం దీనికి నిదర్శనంగా చెప్పాలి. టీచర్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి నాలుగేళ్ల క్రితం నాటిన చెట్టును కొట్టించిన వైనంపై సిద్ధిపేట కమిషనర్ సీరియస్ అయిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. చెట్ల విషయంలో అధికారులు ఈ మాత్రం సీరియస్ నెస్ ప్రదర్శించాల్సిందే అన్న మాట వినిపిస్తోంది.అసలేం జరిగిందంటే..

సిద్దిపేటలోని మహాశక్తి నగరంలో హరితహారం పథకంలో భాగంగా నాలుగేళ్ల క్రితం గుల్ మొహర్ అనే మొక్కను నాటారు. అది కాస్తా చెట్టుగా మారింది. అయితే.. ఈ చెట్టును ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ టీచరుగా పని చేసే దొంతి నర్సిహారెడ్డి నరికివేశారు. అయితే.. హరితహారం పర్యవేక్షుడిగా వ్యవహరిస్తున్న ఐలయ్య ఇచ్చిన నివేదిక ఆధారంగా సదరు టీచర్ పై సిద్దిపేట కమిషనర్ చర్యలు తీసుకున్నారు.

చెట్టును కొట్టేసిన ఆయనకు రూ.20వేలు ఫైన్ విధించారు. అంతేకాదు.. 50 చెట్లను నాటాలని ఆదేశాలు జారీ చేశారు. చెట్ల ప్రాధాన్యత గురించి విద్యార్థులకు బోధించాల్సిన టీచరు.. అందుకు భిన్నంగా ఏ మాత్రం బాధ్యత లేకుండా చెట్టును నరికివేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ చర్యను బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. చెట్ల విషయంలో ఈ మాత్రం సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే పచ్చదనాన్ని పెంచుకోగలుగుతాం.


Tags:    

Similar News