అరే ఏందిరా బై.. సీదిరి ఆక్రోశంతో కూడిన ఉక్రోషం మామూలుగా లేదుగా?

Update: 2023-04-04 10:24 GMT
తరచూ ఏదో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి టార్గెట్ చేసినట్లుగా వ్యవహరిస్తే ఎవరికి మాత్రం ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. అనూహ్యంగా మంత్రి పదవిని చేజిక్కించుకొని ఏపీ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఆయన పదవి త్వరలో ఊడిపోతుందంటూ మీడియాలోఒక రేంజ్లో ప్రచారం జరుగుతోంది. దీనికి నిదర్శనంగా.. ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను తాడేపల్లికి పిలిపించుకోవటాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన పదవి పోతుందంటూ జోస్యాలు చెబుతున్నారు.

ఈ వ్యవహారం సీదిరి వారికి చికాకు గా మారింది. తాజాగా ఆయన తన ఆగ్రహాన్ని మీడియా ఎదుట వ్యక్తపర్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించటం.. దీనికి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దాదాపుగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమీక్షా కార్యక్రమం ముగిసిన అనంతరం నేతలు బయటకు వెళ్లే క్రమంలో పలువురు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి వంతు వచ్చింది.

ఇటీవల కాలంలో ఆయన పై పలు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి.. మంత్రి పదవి పోతుందన్న మాట అయితే.. మరొకటి పలు ప్రైవేటు పంచాయితీలు చేపడుతున్నారని.. వివాదాల్లో తలదూరుస్తున్నారని. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆయన ముందు మైకులు పెట్టి మాట్లాడతా.. తనదైన శైలిలోఆయన రియాక్టు అయ్యారు. ఒక వ్యక్తి ముందుకు వచ్చి.. అతడికి సంబంధించిన నెగిటివ్ అంశాల్ని ముఖాన అడిగే స్తే ఎవరికి మాత్రం మండదు. అందునా.. మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన్ను పట్టుకొని .. త్వరలో మీ మంత్రి పదవి పోతుందట కదా? ముఖ్యమంత్రి జగన్ ఎందుకు పిలిచారు? ఏం మాట్లాడారు? లాంటి ప్రశ్నలు వేయటంతో సీదిరికి చిరాకెత్తేసింది.

అంతే.. ఆయన తన ఆక్రోశాన్ని ఆవేశంగా బయటపడేశారు. "అరే ఏందిరా బై.. మొన్నేమో నా మంత్రి పదవిని తీసేశారు మీరు.. ఈ రోజు ఎమ్మెల్యే పదవిని కూడా మీరే తీసేశారు. అసలు మీకు ఇవన్నీ ఎలా వస్తాయో తెలియట్లేదు. నేను మరింత ఉత్సాహంతో పని చేస్తాను" అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి పై దాడి చేశారన్న వార్తలు వస్తున్నాయి? అంటే.. మరోసారి ఆయన ఆగ్రహానికి గురయ్యారు. ఏందిరా బై నా మీద ఇన్ని.. అంటూ.. 'ఎవడిదో భూమిని ఎవడో ఆక్రమించుకుంటే వాళ్లు ఊరుకుంటారా? వాళ్లు పట్టుకొని తన్నారు. దానికి నాకేంటి సంబంధం. అసలు ఆ కొట్టినోడు నా నియోజకవర్గం వాడే కాదు. అలాంటప్పుడు నాకేంటి సంబంధం. ఎక్కడేం జరిగినా నాకే అంటకడుతున్నారు' అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి సీదిరి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News