హుజూరాబాద్‌లో మైకులు సైలెంట్‌.. ఏం జ‌రిగింది?

Update: 2021-09-15 23:30 GMT
నిన్న మొన్న‌టి వ‌ర‌కు నేత‌ల కామెంట్ల తూటాల‌తో ద‌ద్ద‌రిల్లిన మైకులు కొన్ని రోజులుగా మూగ‌బోయాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. నేత‌ల హ‌డావుడితో దుమ్మురేగిన ర‌హ‌దారులు.. మ‌ట్టిముద్ద‌ల్లా.. మౌనంగా ఉన్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇంటింటా హ‌డావుడి.. మీడియా చానెళ్ల బ్రేకింగుల‌తో రేగిన సంచ‌నాలు.. ఒక్క‌సారిగా మౌనం అయిపోయాయి. ఇవ‌న్నీ.. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి క‌రీం న‌గ‌ర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో నిన్నటి వ‌ర‌కు క‌నిపించిన‌.. దృశ్యాలు. కాని, ఇప్పుడు అక్క‌డ నిశ్శ‌బ్దం రాజ్య‌మేలుతోంది. రాజ‌కీయ కామెంట్లు చ‌ల్ల‌బ‌డ్డాయి. దీనికి కార‌ణ‌మేంటి? ఇప్పుడు ఇదీ.. ప్ర‌శ్న‌!

సీనియ‌ర్ పొలిటిక‌ల్ నాయ‌కుడు, ఉద్య‌మ నేత ఈట‌ల రాజేంద‌ర్‌.. సుమారు ఆరు ఎన్నిక‌ల నుంచి హుజూ రాబాద్ నుంచి గెలుస్తున్నారు. టీఆర్ ఎస్ నాయ‌కుడుగా.. బీసీ నేత‌గా ఆయ‌న‌కు ఇక్క‌డ మంచి గుర్తింపు కూడా ఉంది. అయితే.. కేసీఆర్‌తో త‌లెత్తిన విభేదాల‌తో ఆయ‌న అధికార పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యే పీఠానికి కూడా రిజైన్ చేసి.. బీజేపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఈ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతోంది. దీంతో అటు ఈట‌ల‌, ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీలు ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్నాయి.

అయితే.. అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు ఇది ప్ర‌తిష్టాత్మ‌క నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం.. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈట‌ల‌ను ఎలాగైనా ఓడించాల‌నే నిర్ణ‌యంతో అధికార పార్టీ నాయ‌కుడు, సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. దీంతో రాజ‌కీయంగా హుజూరాబాద్‌లో భారీ వేడి రాజుకుంది. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉండగా టీఆర్ఎస్ నుంచి యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు.

అయితే పొలికల్ ప్రచారంలో మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు జోరు చూపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పాదయాత్ర చేపడుతూ ప్రజలను ఆకట్టుకుంటు న్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్నారు. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలను తీసుకున్నారు. బీజేపీకి ధీటుగా వ్యూహాలను రచిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో దళిత బంధును పైలెట్ ప్రాజెక్టు ప్రకటించి రాజకీయ వేడి రాజేశారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.

మరి ఇంత‌లా జోరుగా సాగుతున్న ప్ర‌చారంలో ఒక్క‌సారిగా బ్రేక్ ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఈ ఉప ఎన్నిక‌ల‌ను ఇప్పుడే నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోవ‌డ‌మే! సెప్టెంబర్లోనే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే కరోనా నేప‌థ్యంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికను వాయిదా వేసింది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా వాయిదా పడింది. వచ్చే నవంబర్ లేదంటే డిసెంబర్లో ఉప ఎన్నిక ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. ఎన్నిక వాయిదా పడటంతో నేతలు పెద్దగా ఖర్చు పెట్టేందుకు ఇష్టపడటం లేదు.

ఎన్నికల ముందు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ముందు జాగ్రత్తతోనే పార్టీల నేతలు ఇప్పుడు సైలంటైనట్లు తెలుస్తోంది. దీంతో హుజురాబాద్ లో కొంతకాలంగా ఉన్న ప్రచార హోరు.. జోరు.. ఇప్పుడు కన్పించడం లేదు. ఏదేమైనా.. ఎంత నాయ‌కులైనా.. డ‌బ్బులు ఊరికేనే రావుగా అనుకున్నారో..ఏమో.. ఎన్నిక‌ల ముందు చూసుకోవ‌చ్చ‌ని భావించారో.. ఏమో.. మౌనంగా ఉన్నారు. ఇదీ సంగ‌తి!!


Tags:    

Similar News