సూపర్ స్టార్ రజనీకాంత్ - విలక్షణ నటుడు కమల్ హాసన్... ఇద్దరూ తమిళ సినీ ఇండస్ట్రీ కోలీవుడ్ కే చెందినా... వారి మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణానంతరం తమిళనాట నెలకొన్న రాజకీయ శూన్యతను అవకాశంగా తీసుకుని రాజకీయ తెరంగేట్రానికి ఇద్దరు నటులూ తమదైన మార్గాల్లో పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్న నేతలుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జయ మరణం కంటే ముందుగానే రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి చర్చ మొదలవగా, జయ మరణానంతరం... అది కూడా ఓ టీవీ షో ద్వారా రేకెత్తిన వివాదం నేపథ్యంలో కమల్ తన రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరిగేలా వ్యవహరించారు. తమిళ సినీ ఇండస్ట్రీకే చెందిన వీరిద్దరి మధ్య ఎంత సారూప్యత ఉందో... అంతకంటే ఎక్కువగా వారి మధ్య వైరుధ్యాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. సినిమాల్లోనూ వీరిద్దరి దారి వేరుగానే సాగిందన్న విషయం మనకు తెలిసిందే.
కమల్ హాసన్ - రజనీకాంత్ కలిసి చాలా సినిమాల్లో కలిసి నటించారు కూడా. 1970 దశకంలో వారు నటించిన చాలా సినిమాలు ప్రజాదరణ పొందాయి. కమల్ హాసన్ హీరోలాంటి స్ట్రెయిట్ పాత్రలు చేస్తే - రజనీకాంత్ కాస్తా విలనిజం ఉన్న స్టైలిష్ పాత్రలు చేశారు. ఇక వ్యక్తిగతంగా చూస్తే... కమల్ నాస్తికుడిలా కనిపిస్తే... రజనీ మాత్రం దైవచింతన మెండుగా ఉన్న వ్యక్తిగా వ్యవహరిస్తారు. నిత్యం ధ్యానం వంటి వాటిలోనే గడిపేందుకు రజనీ ఆసక్తి చూపుతారని కూడా చెబుతారు. ఇక ధ్యానం కోసం రజనీ తరచూ హిమాలయాలు కూడా వెళుతుంటారన్న వాదన కూడా లేకపోలేదు. అయితే దైవ చింతన అన్న మాట కమల్ విషయంలో కనిపించదు. పక్కా నాస్తికుడిగా వ్యవహరించే కమల్... తనకు దేవుడిపై నమ్మకం లేదని - కాషాయం అంటే తనకు పడదని కూడా ఆయన వ్యాఖ్యానించిన విషయం మనకు తెలిసిందే. మాట తీరు విషయానికి వచ్చినా... ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసమే కనిపిస్తోంది. కమల్ హాసన్ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. రజనీకాంత్ ఆచితూచి మాట్లాడుతారు. రజనీ అస్సలు ఎక్కువ మాట్లాడరు.
రాజకీయాలు ఎంత కష్టమో తనకు తెలుసునని, అందువల్ల జాగ్రత్త - పథకం ప్రకారం వ్యవహరించడం ముఖ్యమని రజనీకాంత్ నమ్ముతారు. అయితే ఈ తరహా జాగ్రత్త కమల్‌లో కనిపించదనే చెప్పాలి. అనుకున్నది ముందూ వెనుకా చూసుకోకుండా నేరుగా రంగంలోకి దిగిపోవడమే తనకు తెలుసన్న రీతిలో కమల్ వ్యవహరిస్తారు. ఇక నేటివిటీ పరంగా చూసినా వీరిద్దరూ భిన్న ధృవాలుగానే కనిపిస్తారు. తమిళ సినీ ఇండస్ట్రీలోనే వీరిద్దరూ ఉన్నా... ఇద్దరిదీ ఒకే రాష్ట్ర కాదన్న విషయం ఇప్పుడు మరోమారు తెరపైకి వచ్చింది. కమల్ హాసన్ రామంతపురంలో జన్మించారు. ఆయనను తమిళుడిగా అంతా భావిస్తుంటారు. రజనీకాంత్ స్థానికుడు కాదని, కర్ణాటకకు చెందినవాడని అంటారు. ఇది రజనీకాంత్‌కు కొంత వ్యతిరేకంగా పనిచేస్తుందనే భావన ఉంది. అయితే, బెంగుళూరులో జన్మించిన జయలలిత ముఖ్యమంత్రి కాలేదా అని రజనీ అభిమానులు ఇప్పుడు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి చూసినా వీరిద్దరి మధ్య వైరుధ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇద్దరు కూడా చాలా ఉత్సాహం చూపినా... కమల్ స్థాయిలో రజనీ దూకుడు ప్రదర్శించలేదు. చాలా కాలం నుంచి రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చలు జరుగుతున్నా... ఏనాడూ ఆ దిశగా రజనీ దూకుడును ప్రదర్శించలేదనే చెప్పాలి. అయితే అందుకు భిన్నంగా కమల్ మాత్రం బిగ్ బాస్ తమిళ వెర్షన్ షోపై రేగిన వివాదంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచి... ఆ వివాదం నేపథ్యంలోనే ఆయన రాజకీయాల వైపు దృష్టి సారించారు. అంతేకాకుండా రజనీలాగా ఆచితూచిగా కాకుండా దూకుడుగా వ్యవహరించారు. రాజకీయాల్లోకి తాను దిగిపోయాననంటూ ఇప్పటికే ప్రకటించిన కమల్... జనవరిలో మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. అయితే అందుకు విరుద్ధంగా తంబీలంతా కమల్ హాసన్‌ను క్లాస్‌గాను, రజనీకాంత్‌ను మాస్‌గానూ చెప్పుకోవడం గమనార్హం. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన రజనీ... తన రాజకీయ రంగ ప్రవేశంపై చాలా ఆచితూచి స్పందించారు.
తమిళనాడు వ్యాప్తంగా ఉన్న తన అభిమాన గణంతో రోజుల తరబడి చర్చలు జరిపిన రజనీ... చివరకు నేటి ఉదయం తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. యుద్ధంలోకి దిగితే గెలిచి తీరాల్సిందేనని ఆయన అన్నారు. తాను యుద్ధరంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే... ఇన్ని వైరుధ్యాలున్న వీరి మధ్య మరో అంశంలో సారూప్యత కనిపిస్తోంది. జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందనే భావన ఉంది. ఈ శూన్యతలోనే రాజకీయాల్లో తమ సత్తా చాటాలని కమల్ హాసన్, రజనీకాంత్ భావించారు. ఎంజీ రామచంద్రన్ - జయలలిత మాదిరిగానే సినిమా ఇమేజ్ తమకు కలిసి వస్తుందని వారు ఇద్దరూ భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే... కమల్, రజనీలు ఇద్దరు కోలీవుడ్‌కే చెందినా, తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా ఉన్నా... వారి వ్యవహార సరళి చూస్తే ఇద్దరూ భిన్న ధృవాలుగానే చెప్పుకోవాలి.