సింగపూర్ వెనక్కి పోతోందా?

Update: 2015-12-25 11:30 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పెట్టుబడి పెట్టే విషయంలో సింగపూర్ వెనక్కి పోతోందా? దాని గొంతెమ్మ కోర్కెలను తీరుద్దామని ఏపీ సర్కారు భావించినా కేంద్ర ప్రభుత్వం అడ్డు పడుతోందా? విదేశీ సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వవద్దని తేల్చి చెబుతోందా? ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణం కూడా ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు ఔను అనే జవాబిస్తున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు.

అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ బిల్డర్ గా సింగపూర్ బిడ్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సింగపూర్ కూడా భారీగానే ప్రతిపాదనలు చేస్తోంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే తమకు 3000 ఎకరాలు కావాలని డిమాండ్ చేస్తోంది. 3000 ఎకరాలను తమకు ఇస్తే.. తొలుత తాము 300 కోట్లను మాత్రం పెట్టుబడులు పెడతామని, ప్రభుత్వం ఇచ్చిన 3000 ఎకరాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని, రుణాలు తీసుకుని ఆ వచ్చిన డబ్బులతో అమరావతిలో పెట్టుబడులు పెడతామని చంద్రబాబు సర్కారుకు వివరించినట్లు తెలిసింది. అయితే, సింగపూర్ ప్రతిపాదనను గమనించిన చంద్రబాబుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని లేపాక్షి అనుభవం గుర్తుకు వచ్చిందని తెలుస్తోంది. అప్పట్లో లేపాక్షి భూములు తీసుకున్న పెట్టుబడిదారులు.. వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి.. ఆ వచ్చిన డబ్బులతో తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారు తప్పితే అనంతపురంలో పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు. ఇప్పుడు ఆ భూములను అమ్ముకుందామన్నా బ్యాంకు తాకట్టులో ఉన్నాయి. దాంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితుల్లో దిక్కుతోచకుండా ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే, 3000 ఎకరాలు ఇచ్చేది లేదని, తొలుత కేవలం 70 ఎకరాలను మాత్రమే ఇస్తామని ప్రతిపాదిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ మీనమేషాలు లెక్కిస్తోందని సమాచారం.
Tags:    

Similar News