భారత్ నుంచి కరోనా అవుట్... ఆ డేట్ దాకా ఆగాల్సిందే

Update: 2020-04-28 16:30 GMT
యావత్తు ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా నుంచి భారత్ కు ఎప్పుడు విముక్తి లభిస్తుంది? అసలు దేశంలో కరోనా కేసులు జీరోకు ఎఫ్పుడు చేరుకుంటాయి? లాక్ డౌన్ ఎప్పటికి గానీ ఎత్తేస్తారు?... ఇలా చాలా ప్రశ్నలే మన మెదళ్లలో మెదలుతున్నాయి. వీటికి మన వద్ద అయితే సమాధానం లేదు గానీ... సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతోంది. మన దేశానికే కాకుండా ప్రపంచలో కరోనాతో విలవిల్లాడుతున్న పలు దేశాలకు కూడా ఈ వర్సిటీ ఆసక్తికర అంశాలను వినిపిస్తోంది. ఈ వర్సిటీ అంచనా ప్రకారం జూలై 25, 2020 నాటికి భారత్.. కరోనా ఫ్రీ కంట్రీగా రూపాంతరం చెందుతుందట.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి సింగపూర్ యూనివర్శిటీ తన నివేదికలో... మే-22నాటికి భారతదేశం 97 శాతం కరోనా వైరస్ కేసులను నిర్మూలిస్తుందని, జూన్ 1 నాటికి 99 శాతం, జూలై 25 నాటికి 100 శాతం కరోనాను నిర్మూలిస్తుందని తెలిపింది. అంటే మన దేశంలో కరోనా పూర్తిగా అంతరించిపోవాలంటే... ఇంకా రెండు నెలల సమయం పడుతుందన్నమాట. ఈ అధ్యయనం ప్రకారం మే 22 నాటికి దేశంలో 97 శాతం కరోనా కేసులను నిర్మూలించే అవకాశాలున్న నేపథ్యంలో లాక్ డౌన్ కూడా మే నెలాఖరులోగా పూర్తిగానే తొలగించే అవకశాలు లేకపోలేదు.

భారత్ సంగతి ఇలా ఉంటే... విశ్వవ్యాప్తంగా కరోనా ఎప్పటికి అంతమవుతుందన్న విషయంపైనా సింగపూర్ వర్సిటీ తన అంచనాను వెల్లడించింది. అదే సమయంలో కరోనాతో అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతుందన్న విషయాన్ని కూడా చెప్పేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఆగస్టు-27నాటికి కరోనా వైరస్ నుంచి అమెరికా విముక్తి పొందనుందట. డిసెంబర్ 9,2020నాటికి ప్రపంచం నుంచి కరోనా కనుమరుగైపోనుందట. ప్రపంచవ్యాప్తంగా మే-30నాటికి 97శాతం కరోనా కేసులు ముగుస్తాయని, జూన్-17నాటికి 99శాతం కేసులు,డిసెంబర్ లో 9,2020నాటికి 100శాతం కరోనా కేసులు ఆగిపోతాయని తెలిపింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఇటలీలో మే-8నాటికి 97శాతం కేసులు,మే-21నాటికి 99శాతం కేసులు,ఆగస్టు25నాటికి 100శాతం కేసులు ఆగిపోతాయని తెలిపింది. ప్రాన్స్ లో మే-6నాటికి 97శాతం కేసులు,మే-18నాటికి 99శాతం కేసులు, ఆగస్టు-5నాటికి 100శాతం కేసులు ఆగిపోతాయని ఈ రిపోర్ట్ అంచనా వేసింది.
Tags:    

Similar News