చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అక్రమాలపై సిట్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్

Update: 2023-05-03 11:59 GMT
ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఊరట లభించింది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించటం.. అక్రమాల లెక్క తేల్చేందుకు వీలుగా సిట్ ను ఏర్పాటు చేసిన వైనంపై సుప్రీంకోర్టు తాజాగా ఓకే చెప్పింది. సిట్ ఏర్పాటును తప్పు పడుతూ టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించటం.. అక్కడ స్టే లభించటం తెలిసిందే.

ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ప్రభుత్వ అక్రమాలపై సిట్ ఏర్పాటుపై స్టే ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని పక్కన పెట్టేయాలని ప్రకటించింది. మెరిట్ ప్రాతిపదికనకేసు విచారణ చేపట్టాలని.. దీనిపై విచారించి తదుపరి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచన చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ తో కూడిన డివిజనల్ బెంచ్ తాజా ఆదేశాల్ని ఇచ్చింది.

చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై సిట్ విచారణ జరిపేందుకు మార్గం సుగమమైంది. కీలక విధాన పరమైన నిర్ణయాలతో పాటు..అమరావతి భూకుంభకోణంతో పాటు భారీ ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగినట్లుగాజగన్ సర్కారు గుర్తించింది.

ఈ క్రమంలో సిట్ ను దర్యాప్తునకు ఆదేశించింది. అయితే.. దీనిపై హైకోర్టు స్టే విధించగా.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ సర్కారు తన వాదనను పెద్ద ఎ్తతున  వినిపించింది. ఈ సందర్భంగా సుప్రీం కీలకవ్యాఖ్య చేసింది.

దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వటం సరైనది కాదు. సీబీఐ.. ఈడీ దర్యాప్తునకుసైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని స్పష్టం చేసింది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు.. గత ప్రభుత్వ విధానాల్ని మార్చటానికి ఇవ్వలేదంది.

జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సు హైకోర్టు పరిశీలించలేదంది. హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నట్లుగా డివిజన్ బెంచ్ ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల ఆరోపణలపై సిట్ విచారణ చేసేందుకు మార్గం సుగమమైందని చెప్పాలి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో  కీలక పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Similar News