తెలుగుత‌ల్లి మానంపై చేయివేశారు..చేయి న‌రికేయాలి

Update: 2018-03-19 14:41 GMT
ప్ర‌త్యేక‌హోదా కోసం నిర్వ‌హించిన స‌మావేశంలో సినీ హీరో శివాజీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రత్యేక హోదాపై విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క‌ల‌క‌లం రేకెత్తించే వ్యాఖ్య‌లు చేశారు. ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు - సీపీఎం రాష్ట కార్యదర్శి రామకృష్ణ - హీరో శివాజీ - కొణతాల రామకృష్ణ - ఎపిసిసి వైస్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. తెలుగుజాతి ఉద్యమం దేశ స్థాయిలోకి వెళ్లడం శుభపరిణామమని తెలిపారు. ప్రస్తుత సమయంలో రాష్ట్రంలో అందరం కలిసుండాలని, కలిసి పోరాడాలన్నారు.

తెలుగుతల్లి మానంపై చెయ్యివేయ్యాలని బీజేపీ చూస్తుందని, అలాంటి చెయ్యిని నరికిపడేయ్యాలని శివాజి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హోదా గురించి మాట్లాడుతుంటే నాపై దాడికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆంధ్రులకు కోపం వస్తే దేశంలోనే బీజేపీ కనపడకుండా పోతుందని ఆయ‌న వ్యాఖ్యానించారు. హోదా ఉదృతం అవ్వాలంటే రైళ్లు, జాతీయ రహదారుల దిగ్భందం చేయాలని పిన్నారు. ఓఎన్జీసీ, రిలయన్స్ పెట్రో కెమికల్స్ వంటి వాటిని నిర్బంధిస్తే కేంద్రం తక్షణం దిగివస్తుందని ఆయన సూచించారు.  హోదా కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని శివాజీ ప్రకటించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ హోదా పోరాటం ఢిల్లీకి షాక్ కొట్టే విధంగా ఉండాలన్నారు. రైళ్లు, జాతీయ రహదారుల నిర్బంధం చెయ్యాలి.. అప్పుడే కేంద్రంలో చలనం వస్తుందని సూచించారు. ఇలా ఉద్య‌మం చేస్తే..అడ్డుకుంటాడో.. మద్దతు ఇస్తారో సీఎం చంద్రబాబు వైఖరి తెలిసిపోతుందన్నారు. `ఇదే అంతిమ పోరాటం.. ఇప్పుడే తేల్చుకోవాలి...మళ్ళీ సమయం రాదు` అని అన్నారు. .

Tags:    

Similar News