తెలంగాణ మార్షల్స్..మంత్రికే చుక్కలు చూపారుగా!

Update: 2020-03-07 18:09 GMT
తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలిలో పనిచేస్తున్న మార్షల్స్ నిజంగానే అతి చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. చట్టసభల్లో పరిస్థితి అదుపు తప్పినప్పుడు స్పీకర్ లేదంటే... మండలి చైర్మన్ అనుమతితో సభల్లోకి ప్రవేశించే మార్షల్స్... సభా సమావేశాలను అడ్డుకునే నేతలను బయటకు తీసుకొస్తారు. అదే సమయంలో అసెంబ్లీ, మండలి పరిధిలో శాంతి భద్రతలను కూడా పర్యవేక్షించే క్రమంలో నేతలతో పాటు సభా సమావేశాలను వీక్షించేందుకు వచ్చే వారి ప్రవేశాలను కూడా పర్యవేక్షిస్తారు. ఇలాంటి కీలక బాధ్యతలను నిర్వర్తించాల్సిన మార్షల్స్... ఇప్పుడు తమదైన శైలిలో అతిగా వ్యవహరించి మంత్రి పువ్వాడ అజయ్ కి చుక్కలు చూపారు.

అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభా సమావేశాల్లో భాగంగా మంత్రి హోదాలో పువ్వాడ అజయ్... శాసనమండలిలోకి ప్రవేశించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గేటు వద్ద డ్యూటీలో ఉన్న మార్షల్స్ ఆయనను అడ్డుకున్నారు. మండలిలోకి ప్రవేశం లేదని అజయ్ కి ముఖం మీదే చెప్పేశారట. దీంతో చిర్రెత్తిపోయిన అజయ్... తాను మంత్రిని అని చెప్పడంతో నాలిక్కరచుకున్న మార్షల్స్... ఆయనను సభలోకి అనుమతించారట. ఈ విషయంలో తనకు అవమానం జరిగిందంటూ మండలి చైర్మన్ కు అజయ్ ఫిర్యాదు చేశారట.

అయినా శాసన సభ, మండలి పరిసరాలను డేగ కన్నుతో పర్యవేక్షించే మార్షల్స్ కు మంత్రి ఎవరో, ఎమ్మెల్యే ఎవరో తెలియకుండా ఉంటుందా? ఎమ్మెల్యేలు అంటే వందకు పైగా ఉన్నా... మంత్రులు అతి తక్కువ మందే ఉంటారు కదా. అంతేకాకుండా అటు అసెంబ్లీ అయినా, ఇటు మండలి సమావేశాలు అయినా ప్రభుత్వ వాదనను వినిపించే విషయంలో కీలకంగా వ్యవహరించే మంత్రులను కూడా గుర్తు పెట్టుకోలేకపోతే ఎలా? ఇదే విషయాన్ని ప్రస్తావించిన అజయ్... తాను మంత్రి అని చెప్పేదాకా మార్షల్స్ తనను గేటు బయటే నిలిపివేశారని చైర్మన్ కు ఫిర్యాదు చేశారట. మరి అజయ్ ను అడ్డుకున్న మార్షల్స్ పై చైర్మన్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News