పాతబస్తీలో ఆరుగురు దొరికిపోయారు

Update: 2016-06-29 06:05 GMT
దేశంలో ఉగ్ర జాడలు ఎక్కడ బయటపడినా.. దాని మూలాలు కచ్ఛితంగా హైదరాబాద్ కు ఎంతో కొంత లింకు ఉంటుందన్న విషయం మరోసారి రుజువైంది. తాజాగా హైదరాబాద్ లోని పాతబస్తీలో ఆరుగురు ఐసిస్ సానుభూతిపరుల్ని ఏన్ ఐఏ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారి కలకలం రేగింది. తాజాగా జరిపిన దాడులతో.. దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు జరుపుతున్న కుట్ర భగ్నమైందని చెప్పాలి.

సోషల్ మీడియాలో ఒక గ్రూప్ గా ఏర్పడి.. దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించాలన్నది ఈ దుర్మార్గుల ప్లాన్. నరరూప రాక్షసులుగా చెప్పే ఐసిస్ సంస్థకు సానుభూతిపరులుగా మారిన కొందరు సోషల్ మీడియాతో జట్టుగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి.. భారీ కుట్రకు తెర తీశారు. అయితే.. సోషల్ మీడియాలో జరిగే కార్యకలాపాలపై డేగ కన్ను వేసే ఎన్ ఐఏ ఈ కుట్రను పసిగట్టింది. తీగ లాగిన వారికి.. అది హైదరాబాద్ పాతబస్తీలో ఉన్నట్లుగా గుర్తించారు.

హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందం స్థానిక పోలీసుల సాయంతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితుల్ని గుర్తించారు. ముందుగా అనుమానించినట్లే.. వీరి వద్ద భారీ పేలుడు పదార్థాలు.. మారణాయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. మరింత విచారణ కోసం వీరిని ఢిల్లీకి తరలిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం.. హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నటంతో పాటు.. పలువురు ప్రముఖుల్ని లక్ష్యంగా చేసుకొని.. వారిని హతమార్చటం ద్వారా మరిన్ని సమస్యల్ని సృష్టించేందుకు వీరు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్నారు. ఎన్ఐఏ బృందం అలెర్ట్ గా ఉండటంతో ఒక భారీ విధ్వంసం నుంచి హైదరాబాద్ మహా నగరం తప్పించుకుందని చెప్పొచ్చు.
Tags:    

Similar News