అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్.. చాకచక్యంగా బయటపడ్డ స్మిత సభర్వాల్

Update: 2023-01-22 07:15 GMT
తెలంగాణ మహిళ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ ఓ డిప్యూటీ తహసీల్దార్ అక్రమంగా చొరబడడం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగం విషయం మాట్లాడేందుకు అంటూ ఇంట్లోకి ప్రవేశించిన అతడిని చూసి అధికారి స్మితా సభర్వాల్ కేకలు వేయడం.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకోవడం.. అతడితోపాటు వచ్చిన మరోవ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.  స్మితా సభర్వాల్ ట్వీట్లను రీట్వీట్లు చేసిన ఓ డిప్యూటీ తహసీల్దార్ (48) రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో నేరుగా స్మిత ఇంటికి వచ్చాడు. తన స్నేహితుడైన హోటల్ యజమానిని వెంట తీసుకొని వచ్చాడు. ఫలానా క్వార్టర్ కు వెళ్లాలని కాపలా సిబ్బందికి చెప్పడంతో అనుమానించకుండా అనుమతించారు.

స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ముందు ఉన్న సైడింగ్ డోర్ ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి స్మిత గది తలుపు తట్టాడు. డోర్ తెరిచిన స్మిత గుర్తు తెలియని వ్యక్తిని చూసి షాక్ అయ్యి ఎందుకు వచ్చారని గట్టిగా ప్రశ్నించారు. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పడంతో ఆగ్రహించి బయటకు వెళ్లాలని గట్టిగా కేకలు వేశారు. ఈలోపు భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ తోపాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

-ఘటనపై స్పందించిన స్మిత సభర్వాల్

అర్ధరాత్రి పూట తన ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు ఘటనపై ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ స్పందించారు. ఈ మేరకు ఆమె జరిగిన ఘటన పూర్వపరాలను తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలలను స్వయంగా పరిశీలించుకోవాలి.. అత్యవసర పరిస్థితి ఏర్పడితే డయల్ 100కు ఫోన్ చేయాలి’ అని స్వితా సభర్వాల్ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News