విమ‌ర్శ‌ల‌కు ఫోటోతో పంచ్ ఇచ్చిన స్మృతి!

Update: 2018-10-26 05:12 GMT
మాట‌కు మాట అనే స‌త్తా ఉంది. కానీ.. అన్ని విష‌యాల్లో కాద‌న్నది గుర్తించ‌టం ముఖ్యం. మ‌రీ.. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న నేత‌ల‌కు ఎప్పుడు ఎంత మాట్లాడాల‌న్న విష‌యంపై ఉండే విచ‌క్ష‌ణ వారిని అన‌వ‌స‌ర‌మైన వివాదాల‌కు దూరంగా ఉంచుతుంది. ఈ విష‌యంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మిగిలిన వారితో పోలిస్తే కాస్త భిన్నంగానే వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్పాలి.

త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారిపై విరుచుకుప‌డే రోటీన్ తీరుకు భిన్నంగా ఆమె వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఆ మాట‌కు వ‌స్తే ఆమెలో కూసింత సెన్సాఫ్ హ్యుమ‌ర్ కూడా ఎక్కువే. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారిపై మిగిలిన వారి మాదిరి ఆమె విరుచుకుప‌డ‌రు. ఫోటోల‌తో పంచ్ లు ఇస్తుంటారు. తాజాగా అలాంటి ప‌నే చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. తాజాగా శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్పను ద‌ర్శించుకోవ‌టానికి మ‌హిళ‌ల‌కు వెసులుబాటు ఇస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావ‌టం తెలిసిందే.

వారి ఆందోళ‌న‌ల‌పై సానుకూలంగా స్పందించారు స్మృతి. స్నేహితుల ఇంటికి వెళ్లే వేళ‌.. ర‌క్తంతో త‌డిచిన శానిట‌రీ ప్యాడ్‌ ను తీసుకెళ‌తామా? అంటూ కాసింత ఘాటుగా వ్యాఖ్యానించిన ఆమె.. మ‌త‌విశ్వాసాలకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. స్మృతి వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు విమ‌ర్శ‌లు చేయ‌టం షురూ చేశారు. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నంపై స్మృతి చేసిన విమ‌ర్శ‌ల‌పై స్పందిస్తున్న కొంద‌రు అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండ‌కూడ‌దంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై స్పందించిన స్మృతి తాజాగా ఒక ఫోటోను పోస్ట్ చేశారు. గ‌తంలో తాను టీవీ న‌టిగా ఉన్న‌ప్పుడు న‌టించిన సీరియ‌ల్ లోని దృశ్యాన్ని ఆమె పోస్ట్ చేశారు. స్మృతి న‌టించిన ‘క్యూంకీ సాస్‌ భీ కభి బహూ థీ’ సీరియ‌ల్ లోని ఫోటోను పోస్ట్ చేశారు. అందులో స్మృతిని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు.. చేతులు క‌ట్టేసి నోరు మూసేసిన‌ట్లుగా ఉంది. ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. తాను ఏదైనా మాట్లాడితే.. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాన‌ని అంటుంటార‌న్న క్యాప్ష‌న్ ఇచ్చి త‌న‌ను విమ‌ర్శించే వారిని పంచ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

స్మృతి పోస్ట్ చేసిన ఫోటోపై ప‌లువురు స్పందిస్తున్నారు. ఆమె సెన్సాఫ్ హ్యుమ‌ర్ ను అభినందిస్తున్నారు. ఇష్యూను ఎప్పుడు ఎక్క‌డ ఎలా డీల్ చేయాల‌న్న దానిపై స్మృతి ప్లానింగ్ వేరుగా ఉంటుంద‌న్న విష‌యం తాజా ఉదంతంలో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News