హైదరాబాద్ లో గంధం చెట్ల స్మగ్లింగ్ ... ఎవరీ చోటా వీరప్పన్‌ లు !

Update: 2020-11-12 10:50 GMT
గంధపు చెట్ల స్మగ్లింగ్ అనేది గత కొన్నేళ్ల నుండి అధికారుల కళ్లు గప్పి , కొందరు చేస్తూనే ఉన్నారు. వారిలో కొంతమంది పట్టుబడగా ..మరికొందరు నేటికీ యథేచ్ఛగా స్మగ్లింగ్ కొనసాగిస్తున్నారు. తాజాగా గంధం స్మగ్లింగ్ చేసే చోటా వీరప్పన్లు  నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్కు లో  చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  అక్కడ గంధపు చెట్లను నరికి దుంగలను తీసుకుని పారిపోయిన ఈ సంఘటనపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.  పార్కు కి  వేసిన గేట్లు వేసినట్లే ఉండగా లోపల చెట్లు మాయం కావడం గమనార్హం.

ఇందిరాపార్కులో ఈ తరహా సంఘటన జరగడం ఇది రెండోసారి. నగరంలో గతంలో కూడా  ఇలాంటి సంఘటనలు జరిగాయి.  ఇందిరాపార్కులో ఆదివారం రాత్రి నలుగురు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. లోయర్‌ ట్యాంక్ ‌బండ్‌ లోని రామకృష్ణమఠం గేటు ఎదురుగా ఉన్న ప్రధాన గేటు,  ధర్నా చౌక్‌ లో ఉన్న పార్కు గేటు మూసే ఉన్నాయి. అయితే, అర్ధరాత్రి వేళ దుండగులు పార్కులోకి ప్రవేశించారు. పార్కు కార్యాలయం ఎదుట ఉన్న 13 గంధపు చెట్లను కటింగ్‌ మిషన్‌ తో కట్‌ చేసి, చెట్ల కొమ్మలను అక్కడే పడేసి దుంగలను ఎత్తుకెళ్లారు. ఇందిరాపార్కు బయోడైవర్సిటీ వింగ్‌ అటవీ రేంజ్‌ అధికారి సత్యనారాయణ సోమవారం రాత్రి ఈ మేరకు గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా ఇందిరాపార్క్‌ సెక్యూరిటీ సిబ్బంది, సమీపంలో నివాసితులను విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ అధికారులు నిద్రమత్తును వీడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

పార్కులో  ఇటీవల ఆటోమేటిక్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేసి, రాత్రి 10 గంటల తర్వాత పార్క్‌ మొత్తం లైట్లను ఆర్పివేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వెలిగేలా సిస్టంను రూపొందించారు.  దీనిని అలుసుగా తీసుకున్న కొందరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో లోయర్‌ ట్యాంక్‌ కట్టమైసమ్మ ప్రాంతం నుంచి ఇందిరాపార్క్ ‌లోకి చొరబడుతున్నారు. గంధం చెట్లను పెద్ద పెద్ద రంపాలతో నరికి  తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.   పదేళ్ల క్రితం ఇదే పార్క్‌ లో ఉన్న గంధం చెట్లను స్మగ్లర్లు నరుక్కుని అక్రమంగా తరలించారు. దీనిపై అప్పట్లో జీహెచ్ ‌ఎంసీ విజిలెన్స్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భద్రతను పెంచారు. ఇక   పార్కులో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని జీహెచ్ ‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అధికారులు మార్చారు. కొత్త సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వరిస్తున్నారు. వారికి ఏమీ తెలియదని భావించిన దొంగలు ఈ దొంగతనానికి ఒడిగట్టి ఉంటారని కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్   మాట్లాడుతూ .. రెండు స్పెషల్‌ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ స్మగ్లింగ్‌ కి పాల్పడింది బయట వ్యక్తులేనని, ఇందిరాపార్క్‌ సిబ్బంది సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు.
Tags:    

Similar News