2024లో గెలిచినా తలనొప్పే కదా అంటే చంద్రబాబు లోకేశ్ కు ఏం చెప్పారంటే?

Update: 2023-02-03 09:06 GMT
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ముఖ్యనేత నారా లోకేశ్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్య వచ్చింది లేదు. అంతేకాదు.. ఎప్పుడూ కూడా పార్టీ అధ్యక్షుడు.. తన తండ్రి చంద్రబాబుతో తాను మాట్లాడిన మాటల గురించి ఆయన ప్రస్తావించే సందర్భంగా ఉండదు. అందుకు భిన్నంగా తాను మాట్లాడిన మాటలకు తన తండ్రి చంద్రబాబు ఇచ్చిన జవాబును లోకేశ్ ప్రస్తావించారు. ప్రస్తుతం లోకేశ్ చేపట్టిన పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన పాదయాత్ర పలమనేరులో సాగుతోంది. ఆయన్ను పలువురు న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా వారు లోకేశ్ దృష్టికి  తమ సమస్యల్ని తీసుకొచ్చారు. తాము అధికారంలోకి రాగానే న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే తమను మోసం చేసిన విషయాన్ని లోకేశ్ కు చెప్పారు. దీనికి స్పందించిన లోకేశ్.. న్యాయవాదులకు ఇళ్ల పట్టాల అంశాన్ని తాము మేనిఫేస్టోలో పెడతామని పేర్కొన్నారు.

అంతేకాదు.. పలమనేరులో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జికోర్టు ఏర్పాటు చేస్తామని.. కోర్టు విభజన జరిగితే పలమనేరులో కోర్టు ఏర్పాటు అవుతుందని చెప్పారు. న్యాయవాదులతో మాట్లాడిన సందర్భంగా లోకేశ్ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. 2024లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తలనొప్పే కదా? అని తాను చంద్రబాబును అడిగినట్లు పేర్కొన్నారు.

అందుకు ఆయన స్పందిస్తూ.. 'ఎందుకురా' అని తనను అడిగారని.. లక్షల కోట్ల అప్పులు భయం కలిగిస్తున్నాయని తాను చెప్పినట్లుగా పేర్కొన్నారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ.. 'ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కల్పిస్తుంది' అంటూ చాలా సింఫుల్ గా చెప్పారన్న లోకేశ్.. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారన్నారు. లోకేశ్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

జగన్ పాలనతో పెద్ద ఎత్తున అప్పులు చేశారన్న విషయాన్ని తాజా వ్యాఖ్యతో మరోసారి చర్చకు పెట్టటం బాగానే ఉన్నా.. ఇప్పటికే కొందరు మీడియా ప్రతినిధులు లోకేశ్ నోటి వచ్చిన మాటను తమకు తగ్గట్లుగా మార్చుకొని.. 2024లో మనం గెలిచినా తలనొప్పి తప్పదన్నట్లుగా ప్రచారం చేయటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News