రాజ‌కీయాల్లో సోష‌ల్ మీడియా ‘తీన్మార్‌’!

Update: 2021-03-18 09:30 GMT
ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డంలో సామాజిక మాధ్య‌మాల కీల‌క పాత్ర కొట్టిపారేయ‌లేనిది. ఆ పార్టీ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు.. సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు వేల సంఖ్య‌లోనే ప‌నిచేస్తుంటారనే ప్ర‌చారం కూడా ఉంది. ఈ విష‌యాన్ని గుర్తించిన ఇత‌ర రాజ‌కీయ‌పార్టీలు కూడా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌డం మొద‌లు పెట్టాయి.

అయితే.. రాజ‌కీయాల్లో సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ ఏంట‌నేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌కు కూడా ప్ర‌త్య‌క్షంగా అర్థ‌మయ్యే ఫ‌లితం ఒక‌టి క‌నిపిస్తోంది. అదే.. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితం. అధికార పార్టీ టీఆర్ ఎస్ కు ఈ ఎన్నిక‌లు ఎంత‌టి కీల‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ ఫ‌లితం త‌ర్వాత జారిపోయిన ప్ర‌తిష్ట‌ను తిరిగి నిల‌బెట్టుకోవ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. మ‌రోవైపు బీజేపీ కూడా త‌మ బ‌లం పెంచుకోవ‌డానికి ఈ ఎన్నిక‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కు సంప్ర‌దాయ ఓటింగ్ ఉండ‌నే ఉంది. వీరికితోడు.. రాజ‌కీయ జేఏసీ చైర్మ‌న్ గా ప‌నిచేసి, తెలంగాణ ఏర్పాటులో త‌న‌దైన పాత్ర పోషించిన కోదండ రామ్ కూడా ఇక్క‌డ బ‌రిలో ఉన్నారు.

ఇంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సాగుతున్న పోరులో తీన్మార్ మ‌ల్ల‌న్న అనే ఓ టీవీ యాంక‌ర్ స‌త్తా చాటుతూ.. అధికార పా‌ర్టీతోపాటు ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు. ఏ పార్టీ అండా లేకుండా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నిల‌బ‌డిన తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ న‌వీన్ కుమార్.. కౌంటింగ్ లో ప్ర‌ధాన పార్టీ పార్టీల‌ను వెన‌క్కు నెట్టేసి రెండో స్థానంలో కొన‌సాగుతుండ‌డం రాజకీయ విశ్లేష‌కుల‌ను సైతం నివ్వెర‌ప‌రుస్తోంది.

న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఈ రెండు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి ఆధిక్యంలో నిలిచిన‌ప్ప‌టికీ.. అంద‌రి దృష్టీ రెండో స్థానంలో వ‌చ్చిన మ‌ల్ల‌న్న‌పైనే ఉంది. ప‌ల్లాకు 15,857 ఓట్లు రాగా.. తీన్మార్ మ‌ల్ల‌న్నకు 12,070 ఓట్లు పోల‌య్యాయి. టీజేఎస్ నేత‌ కోదండ‌రాం మూడో స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. తామే టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ ఏకంగా నాలుగో స్థానంలో ఉంది.

ఇలాంటి ఫ‌లితాలు వ‌స్తుండ‌డానికి మ‌ల్ల‌న్న రాజ‌కీయ నేత కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌లకు చేసింది కూడా ఏమీ లేదు. కానీ.. ఆయ‌న ఒక్క‌టే చేస్తున్నాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా.. అధికార పార్టీ టీఆర్ఎస్ ను ప్ర‌శ్నిస్తున్నాడు. కేసీఆర్ చేస్తున్న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌ల్లోని లోపాల‌ను నిల‌దీస్తున్నాడు. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల్లోని లోటుపాట్ల‌ను ఎత్తి చూపుతున్నాడు.

ఒకే ఒక యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఇదంతా చేస్తున్న తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. ఇవాళ రాష్ట్ర ప్ర‌భుత్వ అధినేత‌ల‌ను కూడా క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాడు. దీన్నిబ‌ట్టి.. నేటి రాజ‌కీయాల్లో సోష‌ల్ మీడియా ఎంత కీల‌కంగా మారిందో.. ఒక వాయిస్ జ‌నాల్లోకి ఏ స్థాయిలో వెళ్తుందో.. అనే విష‌యం సుస్ప‌ష్ట‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో న‌వీన్ కుమార్ గెల‌వొచ్చు.. ఓడిపోనూ వ‌చ్చు. కానీ.. సోష‌ల్ మీడియా ప‌వ‌ర్ ఏంట‌న్న‌ది మాత్రం చాటిచెప్పాడ‌న్న‌ది నిర్వివాదం. ఈ ఫ‌లితం నేర్పుతున్న‌ పాఠం ద్వారా.. రాబోయే రోజుల్లో రాజ‌కీయ పార్టీల‌న్నీ సోష‌ల్ మీడియాను కూడా ప్ర‌ధాన ఎజెండాగా తీసుకుని బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.
Tags:    

Similar News