పక్క కంపెనీ ఫోన్ తెచ్చి 251కు అమ్మటమేనా?

Update: 2016-03-05 04:32 GMT
రూ.251 చెల్లిస్తే చాలు అద్భుతమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ మీ సొంతం అంటూ బడాయి ప్రచారాన్ని ప్రారంభించిన రింగింగ్ బెల్స్ ‘అసలు లెక్క’లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జనాల్ని మోసం చేయటమే ఈ కంపెనీ తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. తాజాగా బయటకు వచ్చిన ఉదంతం చూస్తే.. రింగింగ్ బెల్స్ అసలు కథ ఏందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

నోయిడాకు చెందిన ఈ కంపెనీ చేసిన ప్రచారానికి.. చేస్తున్న పనులకు ఏ మాత్రం సంబంధం లేదన్న విషయం తాజాగా తేలినట్లే. ఎందుకంటే.. ఢిల్లీకి చెందిన ఐటీ ఉత్పత్తుల సంస్థ యాడ్ కామ్ వెల్లడించిన సమాచారం ప్రకారం రింగింగ్ బెల్స్ సంస్థ తమకు వెయ్యి ఫోన్లు ఆర్డర్ ఇచ్చిందని పేర్కొంది. మిగిలిన వినియోగదారుల మాదిరే ఒక్కో ఫోన్ ను రింగింగ్ బెల్స్ కు ఒక్కొక్కటి రూ.3600 చొప్పన అమ్మినట్లు వెల్లడించింది.

అంతేకాదు.. తమకు లక్ష ఫోన్లు కావాలని అడిగిందని.. కాకుంటే ఆర్డర్ మాత్రం ఇవ్వలేదని పేర్కొంది. అయితే.. తమ సంస్థకు చెందిన ఫోన్ ను వేరే బ్రాండ్ మీద అమ్ముతున్న విషయం తమకు అర్థం కావటం లేదని.. తమ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా.. తమ బ్రాండ్ ను నష్టపరిచేలా వ్యవహరిస్తే మాత్రం రింగింగ్ బెల్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తాజా ఉదంతంతో పక్క కంపెనీకి చెందిన ఉత్పత్తులపై తమ ముద్ర వేసి రింగింగ్ బెల్స్.. తమ ప్రచారంతో కోట్లాదిమంది ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నించిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News