2-డీజీ ఔషధం గురించి కొన్ని ఆసక్తికర నిజాలు!

Update: 2021-05-19 08:32 GMT
డీఆర్డీవో అభివృద్ధి చేసిన కరోనా మందు 2-డీజీ. ఇటీవలె కేంద్రం దీనిని విడుదల చేసింది. త్వరలో మార్కెట్ లోకి రానుందని ప్రకటించింది. కరోనాను ఎదుర్కొవడానికి ఇప్పటికే భారద్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, సీరం సంస్థ కొవిషీల్డ్, రష్యా టీకా స్ఫుత్నిక్-వి లు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. తాజాగా విడుదలైన 2-డీజీ ఔషధంపై జనాలకు చాలా ఆసక్తి నెలకొంది. దీని పూర్తి సమాచారం కోసం అంతర్జాలాల్లో తెగ శోధిస్తున్నారు. అయితే ఈ ఔషధం గురించి కొన్ని ఆసక్తికర నిజాలు తెలుసుకుందాం.

కరోనా చికిత్సలో 2-డీజీ ఔషధం ఎంత వరకు పని చేస్తుంది? ఎలా ఉపయోగించాలి? ఇది ఎప్పటి నుంచి మార్కెట్ లోకి వస్తుందనే అంశాలను వైద్య నిపుణుడు డాక్టర్ ఏవీఎస్ రెడ్డి వివరించారు. ఈ మందును తొలుత రేడియేషన్ ప్రొటెక్షన్ ఏజెంట్ గా తయారు చేశారని అన్నారు. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడానికి దీనిని ఉపయోగించేవారని చెప్పారు. ఈ మందులో కరోనాను ఎదుర్కొనే కారకాలను గుర్తించినట్లు తెలిపారు.

ఈ ఔషధం కరోనా వైరస్ కు కావాల్సిన గ్లూకోజ్ సరఫరాను నిలిపివేస్తుందని ఆయన చెప్పారు.  ఈ క్రమంలో పునరుత్పత్తి ఆగిపోతుందని అన్నారు. ఫలితంగా వైరస్ విజృంభణను తగ్గించవచ్చని పేర్కొన్నారు. దీనిలో యాంటీ వైరస్, యాంటీ ఇన్ ఫ్లేమిటరీ గుణాలు ఉన్నట్లు ఆయన నిర్ధారించారు. ఈ మందును మూడు దశల్లో 330 మందిపై ప్రయోగించినట్లు తెలిపారు. ఫలితంగా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి దీనిని ఇవ్వడం వల్ల ఆక్సిజన్ మీద ఆధారపడే స్థితిని తగ్గిస్తుందని వివరించారు.

మధ్యస్థ నుంచి తీవ్ర ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ఈ ఔషధం ఇస్తే మంచి ఫలితం కనబర్చిందని ఆయన వెల్లడించారు. పూర్తి పరిశోధనా ఫలితాలు ప్రకటించలేదు. 45 గ్రాముల 2-డీజీ మందును  ఒక గ్లాసు నీటిలో కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవాలని చెప్పారు. ఇలా పది రోజుల పాటు పరిగడుపున తీసుకోవాలని సూచించారు. తొలి దశలో 5000 ప్యాకెట్లను తయారు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని రక్షణ దళానికి పంపిణీ చేశారు. జూన్ మొదటి వారానికల్లా మార్కెట్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News