టీడీపీ ఫైర్ బ్రాండ్ మూగబోయాడు..?

Update: 2019-06-27 05:33 GMT
అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ పై - చంద్రబాబుపై ఈగ వాలనిచ్చే వారు కాదు. వైసీపీ అధినేత జగన్ పై ఒంటికాలిపై లేచేవారు. తీవ్రంగా ఎండగడుతూ విమర్శలు గుప్పించేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చి టీడీపీ ఘోరంగా ఓడిన వేళ ఆయన మౌనం వీడడం లేదు. అజ్ఞాతంలోనే ఉండిపోయారు. టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీలో వాయిసే లేకుండా పోయింది. ఇక మాజీ మంత్రి నారాయణదీ అదే పరిస్థితి. నెల్లూరులో గెలవడానికి చాలా ప్రయత్నించిన నారాయణ ఓటమితో అసలు నెల్లూరు జిల్లాలోనే కనిపించడం లేదట..

ఈ వార్త మీడియాలో హైలెట్ కావడంతో  తాజాగా నారాయణ - సోమిరెడ్డిలు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి టీడీపీ జిల్లా అధ్యక్షుడితో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. మిగిలిన ఓడిన ఎమ్మెల్యేలు కూడా మౌనం వీడలేదు..

ప్రస్తుతం వైసీపీ దూకుడుగా ముందుకెళుతోంది. ప్రజావేదికను కూల్చి బాబు నివాసానికి ఎసరు పెట్టింది. ఇంత సీరియస్ కండీషన్లో కూడా పార్టీ అంటే చెవికోసుకునే సోమిరెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పోయిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ పోటీచేసినా గెలవలేకపోయారు. దీంతో ఈ దారుణ పరాభావం తాలూకా జ్ఞాపకాలు ఆయనను వెంటాడుతున్నాయి.

ఇక మరో చర్చ కూడా సాగుతోంది. ఇటీవలే బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలతోపాటు నెల్లూరు నేతలు టచ్ లో ఉన్నారని.. వీరు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఖేల్ ఖతమైందన్న ఉద్దేశంతోనే సదురు టీడీపీ నేతలు బీజేపీవైపు చూస్తూ నోరు మెదపడం లేదా.? లేదా నిజంగా ఓటమి భారంతో ఇలా అందరికీ దూరంగా ఉన్నారా అన్న చర్చ జిల్లాలో సాగుతోంది.


Tags:    

Similar News