బాల‌య్య చేయి తాక‌టం పుణ్య‌మేన‌ట‌!

Update: 2017-08-18 04:19 GMT
వ్య‌క్తిపూజ మామూలే. రాజ‌కీయాలు.. సినిమా రంగంలో ఈ మోతాదు మ‌రికాస్త ఎక్కువ ఉంటుంది. అయితే.. ఆరాచ‌కానికి పరాకాష్ఠ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు టీడీపీ నేత‌లు. ఓవైపు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన అంశంపై ఎలాంటి జంకుబొంకూ లేకుండా అడ్డ‌దిడ్డంగా స‌మ‌ర్థిస్తున్న వైనం చూస్తే నోట వెంట మాట రాని ప‌రిస్థితి. నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌చారం కోసం ప్ర‌ముఖ సినీరంగ న‌టుడు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  వియ్యంకుడు బాల‌కృష్ణ రావ‌టం తెలిసిందే.

ఆయ‌న బ‌స చేసిన హోట‌ల్‌ కు వెళ్లిన సంద‌ర్భంలో అక్క‌డ‌కు చేరుకున్న‌ బాల‌య్య అభిమానులు ఆయ‌న్ను క‌లిసే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో భాగంగా బాల‌య్య ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌టం.. దీనికి ఆగ్ర‌హించిన ఆయ‌న అభిమాని చెంప ఛెళ్లుమ‌నిపించ‌టం.. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో.. ఇది సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ కావ‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇలాంటి వీడియోలు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌పై ప్ర‌భావాన్ని చూపిస్తాయేమోన‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. అభిమానిపై చేయి చేసుకున్న బాల‌య్య తీరును అడ్డ‌దిడ్డంగా స‌మ‌ర్థించారు క‌ర్నూలు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు. త‌న మాట‌లు ఎంత డ్యామేజ్ చేస్తాయ‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా మాట్లాడేసిన వైనం ఇప్పుడు విస్మ‌యానికి గురి చేస్తోంది. బాల‌కృష్ణ తీరును ఖండించ‌టం త‌ర్వాత‌..కామ్ గా ఉండ‌ని సోమిశెట్టి.. బాల‌కృష్ణ చేయి త‌గిలిందంటే.. పుణ్యం చేసుకున్న‌ట్లేన‌న్నారు. కార్య‌క‌ర్త‌ను బాల‌య్య కొట్ట‌టాన్ని స‌మ‌ర్థించుకున్నారు. బాల‌కృష్ణ కొడితే ఆ అభిమాని పొంగిపోయి ఉంటాడ‌ని.. ఆయ‌న చేయి తాక‌డం అంటే పుణ్యం చేసుకున్న‌ట్లేన‌ని వ్యాఖ్యానించ‌టం సంచ‌ల‌నంగా మారింది. పార్టీలో ఈ స్థాయిలో వ్య‌క్తి పూజ ఏమిటంటూ టీడీపీ నేత‌లుకొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు. లాగి పెట్టి కొట్ట‌టాన్ని ఇంత‌లా స‌మ‌ర్థించుకోవ‌టం మ‌రెక్క‌డా తాము చూడ‌లేద‌న్న వ్యాఖ్య‌ను ప‌లువురు టీడీపీ త‌మ్ముళ్లు చేయ‌టం గ‌మ‌నార్హం. బాల‌య్య చేయి త‌గల‌ట‌మే పుణ్య‌మ‌ని వ్యాఖ్యానిస్తున్న స‌ద‌రు జిల్లా అధ్యక్షుడికి ఒక‌సారి బాల‌య్య చేయి తాకించుకొని పుణ్యం సొంతం చేసుకోవ‌చ్చుగా అంటూ ఎట‌కారం చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Full View
Tags:    

Similar News