టోన్ మార్చిన సోము... పవన్ ఏం చేయాలంటే....?

Update: 2023-02-04 20:00 GMT
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అంటేనే ఫైర్ బ్రాండ్ అంటారు. ఆయన మాట దూకుడు ఎపుడూ అలాగే ఉంటుంది. ఆయన ప్రత్యర్ధి పార్టీలను గట్టిగానే టార్గెట్ చేస్తారు. అలాంటి సోము  వీర్రాజు ఇటీవల తన మిత్రుడు సినీ హీరో అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ణి కార్నర్ చేస్తున్నారు. ఇటీవల సోము వీర్రాజు టోన్ మారింది. గతంలో ఆయన జనసేనతో కలసి తాము ఎన్నికలకు వెళ్తామని చెప్పేవారు. తమ మిత్ర పక్షం జనసేన అని ఒకటికి పదిసార్లు బల్ల గుద్దేవారు.

చిత్రంగా ఇపుడు ఆయన స్వరం మార్చేశారు. అది కూడా తెలంగాణా రాష్ట్రంలోకి కొండగట్టు వద్ద పవన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో తమ మైత్రి ఉందని ఆ పార్టీ తమ మిత్రపక్షం అని చెప్పాక సోము వీర్రాజు డౌట్లు వచ్చేలా మాట్లాడడమే ఇపుడు రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది అని అంటున్నారు. తమ పొత్తులు జనంతోనే అని ఇటీవల కాలంలో అనేక సార్లు సోము వీర్రాజు చెప్పడం వెనక వ్యూహం ఏంటి అన్నది కూడా ఆలోచిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాము జనాన్ని నమ్ముకున్నామని సోము వీర్రాజు ఈ రోజు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. జనాలను రోడ్డున పడేసే పార్టీలతో తమ పొత్తులు ఉండవని కటువుగానే సోము అంటున్నారు. మరి ఆ పార్టీ ఏది అని ఎవరికి వారు చర్చినుకుంటున్నారు. మరో వైపు సోము అయితే కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు అని డైరెక్ట్ గానే వైసీపీని టీడీపీని విమర్శిస్తున్నారు. కాబట్టి ఆ పార్టీలు కాదని అంటున్నారు. అంటే మిత్ర పక్షమైన జనసేన పేరుని నేరుగా ప్రస్థావించకుండా సోము వీర్రాజు ఈ విధంగా బోల్డ్ గా మాట్లడారు అని అంటున్నారు.

ఏపీలో  జనసేన వైఖరి చూశాకనే బీజేపీ పెద్దలు సోముకు ఈ విధంగా డైరెక్షన్ ఇచ్చారని అంటున్నారు. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా లేక పొత్తులకు వెళ్ళినా పెద్దగా కలసివచ్చేది లేదని అంటున్నారు. నాలుగు సీట్లు ఇస్తారని అలా గెలిచి ఎమ్మెల్యే అనిపించుకునే కంటే ఏపీలో తాము సొంతంగా పోటీ చేసి జనాల మెప్పు పొందితే ఏదో నాటికి ఏపీలో అధికారం దక్కుతుందని బీజేపీ భావిస్తోందని, కేంద్ర పెద్దలు కూడా ఆ మేరకు డైరెక్షన్ ఇచ్చారని అంటున్నరు.

ఇక జనసేన బీజేపీతో పొత్తు ఉందని అంటూనే తెలుగుదేశంతో చెట్టపట్టాల్ వేస్తోంది. ఇక బీజేపీతో పొత్తు వద్దు అని అనడంలేదు దాని వెనక కారణాలు ఏమున్నా బీజేపీ కేంద్రంలో బలమైన పార్టీగా అధికారంలో ఉంది. దాంతో గొడవ ఎందుకు అన్న ధోరణిలోనే పవన్ ఉన్నారని అంటున్నారు. అయితే తన నోటితో తాను బీజేపీతో పొత్తు వద్దు అని అనకుండా బీజేపీ ద్వారా చెప్పించాలి అన్నది పవన్ వ్యూహమని అంటున్నారు.

అయితే బీజేపీ మాత్రం ఏ పార్టీని డైరెక్ట్ గా పొత్తు వద్దు వెళ్ళిపొమ్మని అనదు. ఎందుకంటే ఆ సానుభూతి బీజేపీకి కావాలి. అందుకే పవన్ విషయంలో పొత్తులు లేవని బాహాటంగా చెప్పకుండా జనంతోనే తమ పొత్తు అని అంటూ కలసి వస్తే మిగిలిన పార్టీలతో అని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పైగా జనాన్ని రోడ్డున పెట్టిన పార్టీ అని ఇండైరెక్ట్ గా విమర్శలు చేయడం ద్వారా జనసేన మీద వత్తిడి పెంచుతోంది అని అంటున్నారు. మరి జనసేన ఈ సమయంలో బీజేపీతో కలసి పోటీ చేయదు. తెలుగుదేశంతోనే కలసి వెళ్లాలని చూస్తోంది.తమతో వస్తేనే బీజేపీకి మేలు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

ఏపీలో ఓట్ల శాతం పెద్దగా లేకపోయినా తాము కేంద్రంలో బలమైన జాతీయ పార్టీగా పెద్దన్నలుగా ఉన్నామని తమను సబ్ జూనియర్ గా చేసి చంద్రబాబు పవన్ పొత్తులాట ఆడడం మీద కూడా బీజేపీ మండిపాటుగా ఉంది. ఇవన్నీ కలసే ఒంటరు పోరు అన్నట్లుగా పదే పదే సోము స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అని అంటున్నారు. మరి పవన్ని కార్నర్ చేస్తే ఆయన బయటపడతారా బీజేపీతో పొత్తు వద్దు అని డేరింగ్  గా చెబుతారా అంటే చూడాల్సి ఉంది. ఏది ఏమైనా బీజేపీ జనసేనల మధ్య ఉన్నది మిత్ర బంధమా లేక మరే బంధమా అన్నది తొందరలోనే తేలుతుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News