కాషాయమా... ఆవేశ కావేశమా...

Update: 2021-12-27 15:32 GMT
కాషాయం పార్టీ రూటే సెపరేట్. రాష్ట్రానికో నీతి, ఒక్కో చోట ఒక్కో రీతి. ఇదే నయా పొలిటికల్ సూక్తి అన్నదే వంటబట్టించుకున్నట్లుంది. ఏపీలో తొలిసారిగా వైసీపీ సర్కార్ మీద భారీ ఎత్తున సభ పెట్టి మరీ విజయవాడ నడిబొడ్డున అంటే రాజధాని వేదికగా గర్జిస్తోంది. ఈ దెబ్బతో ఏపీ సర్కార్ కి మా తడాఖా చూపిస్తామని సోము వీర్రాజు అంటున్నారు.

ఏపీలో వచ్చేది మా సర్కారే అని కూడా బిగ్  సౌండ్ ఇచ్చారు. జగన్ సర్కార్ అన్ని విషయాల్లో మడమ తిప్పేసింది అని కూడా అంటున్నారు. మొత్తానికి ఇది ప్రజాగ్రహమని ఆయన తేల్చేశారు. ప్రజాగ్రహ సభ అని పేరు పెట్టి మరీ బీజేపీ సై అంటోంది. ఇంతకీ ప్రజాగ్రహం  చూస్తే చాలానే  ఉంది, అది టన్నులకు టన్నులుగా ప్రతీ వారిలోనూ ఉంది. ఏపీలోని పదమూడు జిల్లాల్లో ఉంది.

అధికార పార్టీల మీద ప్రజలకు ఎపుడూ ఆగ్రహం ఉంటుంది. ఎందుకంటే ఏం చేసినా వాళ్ళే చేయాలి, చేస్తారు కనుక. జగన్ సర్కార్ అన్ని విషయంలో మడమ తిప్పేసింది కాబట్టే జనాగ్రహం వెల్లువలా ఉందని చెబుతున్న సోము వీర్రాజు తన వీరావేశంలో కొన్ని విషయాలు మిస్ అయ్యారేమో అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.

నిజానికి మడమ తిప్పడం మొదలెట్టిందే బీజేపీ అంటే వీర్రాజు గారు ఏమంటారో. ఆ తిరుపతి దేవదేవుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీ ఏమై పోయింది వీర్రాజు సామీ అంటే ఏం చెబుతారో. ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఏనాడో జాతికి అంకితం చేస్తామని చెప్పిన కబుర్లు ఇపుడు ఆ ప్రాజెక్టు పడుతున్న పాట్లు, కుంటినడకలకు  ఏం జవాబు ఉందో బీజేపీ సాములే చెప్పాలిగా.

ఇక విభజన తరువాత ఏపీకి ఏమీ లోటు లేదు, ఢిల్లీని తలదన్నే రాజధానిని ఇస్తామని చెప్పిన బీజేపీ పెద్దలు మడమే కాదు, నాలుక ఎందుకు తిప్పేసారో కూడా జనాలకు చెప్పాలేమో కదా. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి కదా. ఇక రాయలసీమ డిక్లరేషన్ పేరిట అక్కడ హైకోర్టు పెట్టాలని, రెండవ రాజధాని చేయలని చెప్పిన వారే ఇపుడు మాట మార్చడం పట్ల సీమ ఘోషిస్తూంటే సమాధానం ఎలా చెప్పాలో తెలియదా కాషాయం పెద్దలూ అంటే ఏమంటారో.

నిజమే ఏపీ సర్కార్ అనేక తప్పులు చేసింది, దానికి మించి అప్పులూ చేసింది. కానీ ఏడేళ్లుగా దేశాన్ని నడుపుతున్న బీజేపీ పెద్దలు కూడా చాలానే చేశారు కదా. ఏపీకి తీరని అన్యాయమే చేశారు కదా. ఆర్ధికంగా అన్ని రకాలుగా కునారిల్లిన ఏపీని ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధులు ఎన్ని ఇచ్చారో చెబితే బాగుంటుద్ని కదా. రెవిన్యూ లోటు ఈ రోజుకీ అలాగే ఉంది మరి. ఏపీకి అన్నీ చేశామని ఎన్నో నిధులు ఇచ్చామని గొప్పగా చెబుతున్న బీజేపీ నేతలు అవన్నీ మిగిలిన రాష్ట్రాలతో పాటే ఇచ్చారని గుర్తు తెచ్చుకోవాలి కదా. విభజన వల్ల సర్వం కోల్పోయిన ఏపీకి నిఖార్సుగా ఇదీ ఇచ్చామని  చెప్పుకునే వీలుందా కాషాయం పెద్దలూ అంటే బదులుందా అన్నదే కదా జనాల మాట.

ఏపీలోని రాజకీయ పార్టీలు తమలో తాము గొడవపడి కేంద్రాన్ని వదిలేస్తే వదిలేయవచ్చు కాక. కానీ అయిదు కోట్ల ఆంధ్రులు కూడా ఈ దేశ జనాభాలోని వారే అని భావించి వారికి న్యాయం చేయాలి కదా. అవన్నీ పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ని తెగనమ్ముతాం, విశాఖ రైల్వే జోన్ ఇవ్వమంటే ఇవ్వమని చెబుతున్నారే. ఇక దేశంలో ముప్పయి దాకా ఎయిర్ పోర్టులు ప్రైవేట్ చేయాలనుకుంటే అందులో కూడా మూడు ఏపీలోనే కనిపించాయనుకుంటే ఏపీ ఏం పాపం చేసింది కాషాయం  సాములూ అంటే జవాబు ఎలా చెబుతారో అని అంటున్నారు.

ఇంతకీ ప్రజాగ్రహం ఎవరి మీద రావాలి. ఎందుకు రావాలీ అన్నది అర్ధమైతే బీజేపీ కధ ఏపీలో వేరేగా ఉండేదేమో. కానీ అవన్నీ పక్కన పెట్టేసి వైసీపీ సర్కార్ మీద కత్తులు దూస్తామంటే దూసుకోండి. కానీ ఇలాంటి సభల ద్వారా జనాలు ఏమారరు, బీజేపీ మీద తమ ఆగ్రహాన్ని చల్లార్చుకోరు అన్న మాటే ప్రజల నుంచి వస్తోంది అంటున్నారు. ఇక బీజేపీ ఇలాంటి సభల కంటే విభజన హామీలను నెరవేర్చి దర్జాగా ఓట్లు అడిగితే అధికార పీఠాన్ని హాయిగా అప్పచెబుతారు కదా. సరైన రూట్ ఉండగా ఈ షార్ట్ కట్ రూట్ లో ఆవేశ కావేశాలు అవసరమా కాషాయమా అన్న కామెంట్స్ పడిపోతున్నాయి మరి.
Tags:    

Similar News