చిన్న విష‌యాల‌కే బెంబేలా? సోము వారి వ‌ర్రీ ఏంటి?

Update: 2022-01-24 00:30 GMT
రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు వ‌ర్రీరాజు అనే నిక్ నేమ్ కూడా ఉంది. ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌ను వ‌ర్రీ రాజు అంటుంటారు. దీనికి కార‌ణం.. స‌మ‌స్య చిన్న‌దైనా పెద్ద‌దైనా..ఆయ‌న ఇట్టే వ‌ర్రీ అయిపోతుంటారు. ఎప్పుడూ తాను నోరు పారేసుకోవ‌డ‌మే కోరుకుంటారు.. త‌ప్ప‌.. త‌న‌పై ఎవ‌రూ ఏమీ అన‌కూడ‌ద‌నే సిద్ధాంతాన్ని బాగా ఒంట బ‌ట్టించుకున్నారు. కానీ, రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. ఇది సాధ్య‌మేనా? ఏ నేత‌కైనా ఇబ్బందులు త‌ప్ప‌వు. ప్ర‌త్య‌ర్థుల నుంచి విమ‌ర్శ‌లు కూడా త‌ప్ప‌వు. కానీ, ఎందుకో.. చిన్న విమ‌ర్శ‌కైనా సోము వ‌ర్రీ అయిపోతున్నారు. ఇటీవ‌ల త‌న సొంత అల్లుడు.. ఒక కేసులో చిక్కుకున్నారు. ఇది పెద్ద యాగీ అయింది. అయితే.. ఇది రాజ‌కీయంగా త‌న మెడ‌కు ఎక్క‌డ చుట్టుకుంటుందో అని సోము వెంట‌నే లైన్‌లోకి వ‌చ్చేశారు. త‌న‌కు, త‌న అల్లుడుకు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పారు.

అస‌లు త‌నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నా.. ఒక అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంద‌ని..ఆ మెతో త‌మ‌కు సంబంధాలు లేవ‌ని చెప్పారు.క‌ట్ చేస్తే.. మొన్న సంక్రాంతికి ఈ అల్లుడు గారు సోము ఇంట్లో ప్రత్య‌క్ష‌మ‌య్యారు. అప్పుడు మ‌ళ్లీ యాగీ అవుతుంద‌ని అనుకున్నారో ఏమో.. తాను పిల‌వ‌కుండానే అల్లుడు, కూతురు వ‌చ్చార‌ని స‌ర్ది చెప్పుకొచ్చారు. ఇక‌, మంత్రి వెల్లంప‌ల్లి  శ్రీనివాస్‌.. సోము పై వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి వెల్లంప‌ల్లి స్థాయికి సోము స్పందించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ,ఆయ‌నే లైన్‌లోకి వ‌చ్చేశారు. న‌న్ను విమ‌ర్శించేంత మొగాడివా! అంటూ.. వెల్లంప‌ల్లిపై విమ‌ర్శ‌లు సంధించారు. ఇవే కాదు.. ఎవ‌రు ఏ మాట అన్నా.. సోము త‌ట్టుకోలేక పోతున్నారు.

మ‌రి అలాంట‌ప్పుడు ఆయ‌న రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారు. వ‌చ్చినా.. రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు ఎందుకు తీసుకున్నారు? అనేది ప్ర‌శ్న‌. ఇది ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న వాద‌న‌. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. ఇలాంటి విమ‌ర్శ‌లు ష‌రా మామూలే. ప‌స ఉంటే స్పందించాలి లేక‌పోతే.. మౌనంగా ఉండాలి. కానీ, సోము మాత్రం త‌న‌ను ఏమీ అనొద్దు..తాను మాత్ర‌మే విమ‌ర్శిస్తాను అనే ధోర‌ణిలో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీని లైన్‌లో పెట్ట‌లేక పోతున్నాన‌నే ఆవేద‌న ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. దీంతోనే చిన్న విష‌యాల‌కే ఆయ‌న రియాక్ట్ అయిపోతున్నార‌ని.. ఇది దీర్ఘ‌కాలంలో మంచిది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి సోము త‌న విధానాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి.
Tags:    

Similar News