తిరుపతి పోరు పై సోము వీర్రాజు యూటర్న్ !

Update: 2020-12-23 10:07 GMT
బీజేపీ , జనసేన ఏపీలో రెండు పార్టీలు కూడా మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. అయితే , త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ , జనసేన మధ్య పొరపచ్చాలు వచ్చినట్టు ఊహాగానాలు వినిపించాయి. దీనికి కారణం ..కొని రోజుల క్రితం తిరుప‌తిలో బీజేపీ అగ్ర‌నాయ‌కులు శోభాయాత్ర నిర్వ‌హించారు. ఆ సంద‌ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ర‌థ‌సార‌థి సోము వీర్రాజు మాట్లాడుతూ తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీనే నిలుస్తుంద‌ని ప్ర‌క‌టించారు. జ‌న‌సేన బ‌ల‌ప‌రిచే త‌మ అభ్య‌ర్థికే ఓటు వేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. బీజేపీ పోటీ చేస్తుంద‌ని, జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ప్రకటించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ మాటే ఎత్తడం లేదు.

తిరుపతి బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థినే అంటూ సోము వీర్రాజు ప్రకటించిన తర్వాత, ఆ మాటలపై తిరుప‌తి జ‌న‌సేన నాయ‌కులు మండిప‌డ్డారు. తిరుప‌తిలో క‌నీసం నోటాకు వ‌చ్చిన‌న్ని ఓట్లు కూడా బీజేపీకి రాలేద‌ని విమర్శలు చేశారు. బీజేపీనే పోటీ చేస్తుంద‌నేది సోము వీర్రాజు వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని జ‌న‌సేన నాయ‌కులు అన్నారు. తిరుప‌తిలో అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నడ్డా క‌లిసి నిర్ణ‌యిస్తార‌ని జ‌న‌సేన నేత‌లు తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే .. తాజాగా చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సోము వీర్రాజు వైఖ‌రిలో భారీ మార్పు కనిపించింది. మ‌ద‌న‌ప‌ల్లెలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తి ఉప ఎన్నిక‌పై త‌మ పార్టీ, జ‌న‌సేన ఇంకా మాట్లాడుకుంటున్నాయ‌న్నారు. త‌మ‌లో ఎవ‌రో ఒక‌రు అభ్య‌ర్థిగా ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. కానీ, ప‌ది రోజుల క్రితం ఏకంగా తామే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన బీజేపీ అద్యక్షడు, తాజాగా యూట‌ర్న్ తీసుకోవ‌డంపై ఇప్పుడు తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. దీనితో జ‌న‌సేన‌కు బీజేపీ భ‌య‌ప‌డిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా తిరుపతి ఎన్నిక పై సోము వెనక్కి తగ్గడం పై జనసేన శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే , ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థినే అంటూ బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. చూడాలి మరి తిరుపతి బరిలో నిలిచే పార్టీ ఎదో , బలపరిచే పార్టీ ఎదో
Tags:    

Similar News