విచిత్రంగా ఉన్న వీర్రాజు డిమాండ్లు

Update: 2020-12-17 06:30 GMT
బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్లు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. విజయవాడలో పార్టీ నేతలతో కలిసి విజయవాడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన తెలపటం ప్రతిపక్షాల హక్కనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ సందర్భంగా ఆయన చేసిన డిమాండ్లే విచిత్రంగా ఉంది. విజయవాడలో కూల్చేసిన ఆలయాలను వెంటనే ప్రభుత్వం పునర్నియమించాలని, ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలంటూ డిమాండ్లు చేశారు. కూల్చేసిన దేవాలయాలను నిర్మించనందుకు దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు దేవాలయాన్ని ఎక్కడా కూల్చలేదు. దేవాలయాల ఆస్తులను కూడా అన్యాక్రాంతం చేయలేదు. భూములను కూడా వేలం వేసి ఎవరికీ రాసిచ్చేసింది లేదు. చంద్రబాబునాయుడు హయాంలో విజయవాడలో ఒకేరోజు 35 దేవాలయాలను కూల్చేశారు.

కృష్ణా పుష్కరాల్లో భాగంగా రోడ్లను వెడల్పు చేయాలని, ఘాట్లను నిర్మించేందుకు అడ్డుగు ఉన్నాయన్న కారణంతో దేవాలయాలను కూల్చేసింది అప్పటి ప్రభుత్వం. అలాగే మంత్రాలయం రాఘవేంద్రస్వామి దేవాలయంకు అనుబంధంగా ఉన్న 210 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని డిసైడ్ చేసి ఉత్తర్వులు జారీ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. ఇదే సమయంలో విశాఖపట్నంలోని సింహాచలం దేవస్ధానంకు చెందిన భూములను లీజులకు ఇచ్చింది కూడా టీడీపీ ప్రభుత్వమే.

అన్నింటికన్నా విచిత్రమేమంటే అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది పైడికొండల మాణిక్యాలరావు. మాణిక్యాలరావు ఎవరయ్యా అంటే బీజేపీ ఎంఎల్ఏ. తాడేపల్లిగూడెంలో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన నేత. తమ నేత దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నపుడే దేవాలయాలను కూల్చేసినా, భూములను లీజుకిచ్చేసినా ఆరోజుల్లో సోమువీర్రాజు కానీ బీజేపీ నేతలు కానీ ఎవరు నోరిప్పలేదు. అప్పుడు చేయాల్సిన డిమాండ్లను వీర్రాజు ఇపుడు చేస్తుండటం, చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదాలకు ఇపుడు జగన్మోహన్ రెడ్డే కారణమని ఆరోపణలు చేస్తుండటమే విచిత్రంగా ఉంది.
Tags:    

Similar News