గ్యాంగ్ రేప్ లో ‘ఏ 6’గా పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడు!

Update: 2022-06-05 04:01 GMT
అనుమానాలు నిజమవుతున్నాయి. సందేహాలకు సమాధానాలు లభిస్తున్నాయి. ఇన్నాళ్లు వేలెత్తి చూపించేందుకు వెనుకా ముందు ఆడుతున్న వారు.. ఇకెలాంటి ఇబ్బంది లేని రీతిలో ఎమ్మెల్యే కొడుక్కి సైతం సామూహిక అత్యాచారం కేసులో సంబంధం ఉందన్న వాదనను వినిపిస్తున్నారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు విడుదల చేసిన వీడియో క్లిప్ తీవ్ర కలకలాన్ని రేపింది. అందులో బాధితురాలికి దగ్గరగా ఉన్న యువకుడు మరెవరో కాదని.. అతడు ఎమ్మెల్యే కొడుకన్న అంశాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు.

నిజానికి ఈ ఉదంతంలో మొదట్నించి కూడా పాతబస్తీ ఎమ్మెల్యే కొడుకు మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. అతగాడు మైనర్ కావటంతో ఆ వివరాల్ని వెల్లడించేందుకు చట్టపరంగా ఎవరికి ఎలాంటి అనుమతులు లేవు. అందుకే ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో.. ఎమ్మెల్యేకుమారుడికి ఈ ఉదంతంలో ఎలాంటి సంబంధాలు లేవంటూ పోలీసులు పేర్కొనటం తెలిసిందే. ఇలాంటి ప్రచారానికి చెక్ పెట్టేలా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ విడుదల చేసిన వీడియో క్లిప్ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా వేదికల మీదా.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ అవుతోంది.

నిబంధనల ప్రకారం చూస్తే.. ఈ వీడియోల్ని సర్క్యులేట్ చేయటం నేరమవుతోంది. ఎందుకంటే మైనర్లకు చెందిన వీడియో కావటం.. వారి వివరాలు బయటకు వచ్చేలా చేయటం లాంటి వాటిపై చర్యలు తీసుకునే వీలుంది. ఇదిలా ఉండగా.. లీకైన వీడియోల్ని సామాన్య ప్రజానీకం ముందుకు రావటానికి ముందే.. పోలీసుల చేతుల్లో ఉండటం.. అక్కడి నుంచే లీకైనట్లుగా చెబుతున్నారు. ఈ వీడియోను చూసిన తర్వాత కూడా ఎమ్మెల్యే పాత్ర లేదని పోలీసులు ఎలా చెబుతారన్న ప్రశ్న తలెత్తుతోంది.

దీనిపై ప్రశ్నలు అంతకంతకూ పెరిగిపోవటంతో పాటు.. ప్రభుత్వానికి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. ఈ కారణంతోనే అతడిపై ఏ 6గా కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు. చివరగా.. బాధిత బాలికకు సంబంధించిన వీడియో క్లిప్పులు ఏవైనా వస్తే వాటిని వెంటనే తొలగించాలే తప్పించి.. వేరే వారికి ఫార్వర్డ్ చేయకూడదన్న విషయాన్ని మరుస్తున్నారు.

అయితే.. ఇదంతా చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు.. దిన దిన గండంగా మారుతుందంటున్నారు. అందుకే వీడియో క్లిప్పు.. ఫోటోలు ఏమైనా మీ వద్దకు వస్తే మాత్రం.. వాటిని ఎవరికి పంపకుండా వెంటనే తీసేయటం మంచిందంటున్నారు. మొత్తంగా చూస్తే ఈఉదంతం పెద్ద ఎత్తున సంచలనంగా మారిన ఇన్ని రోజులకు ఎమ్మెల్యే కుమారుడి పేరును ఏ 6గా పేర్కొంటూ కేసు నమోదు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారన్నది తాజా సమాచారంగా చెబుతున్నారు.
Tags:    

Similar News