పీవీలాగే జైపాల్ రెడ్డినీ సోనియా గాంధీ అవమానించారా?

Update: 2019-07-30 14:21 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంతిమ సంస్కారాల్లో కర్ణాటక మాజీ సీఎం ఆయన పాడె మోశారు. కానీ.. ఆ పార్టీ అధిష్ఠానమైన సోనియా, రాహుల్ గాంధీలు కనీసం జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరుకాలేదు. సోనియా, రాహుల్‌ల తీరు తెలంగాణ కాంగ్రెస్ నేతలనే కాదు, ప్రజలనూ ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ ప్రతినిధులుగా గులాం నబీ అజాద్- మల్లికార్జున ఖర్గేలను పంపించి.. సంతాప సందేశాలను పంపించడంతో రాహుల్- సోనియాలు సరిపెట్టారంటూ జైపాల్ అభిమానులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీకి ఎంతో సేవ చేసిన సీనియర్ లీడర్‌ కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. పీవీని చనిపోయిన తరువాత కూడా అవమానించినట్లే ఇప్పుడు జైపాల్ రెడ్డినీ అవమానించారని టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు సోనియా- రాహుల్‌ లు వెంటనే వచ్చివాలారని.. కానీ, ఇప్పుడు జైపాల్‌కు కనీసం పుష్పాంజలిఘటించడానికి కూడా రావాలనిపించలేదా.. తెలంగాణ నేతలంటే మీకు ఎందుకంత కోపం అని ఓ కాంగ్రెస్ కార్యకర్త జైపాల్ అంత్యక్రియల వద్ద బహిరంగంగానే అనడానికి అంతా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు విషయంలోనూ సోనియా ఇదే తీరుగా వ్యవహరించారని.. ఇప్పుడు జైపాల్‌ మరణం సమయంలోనూ అలాగే అవమానించారని ఆరోపిస్తున్నారు.

జైపాల్ కాంగ్రెస్ విధానాల్లో లోపాలుంటే మొహం మీదే చెప్పేసేవారని.. 2014లో రాష్ట్ర విభజన సమయంలో టీఆరెస్ విలీనాన్ని కోరడం కంటే కేసీఆర్‌ను సీఎంగా ప్రకటించడం మంచిదని సూచించారని.. సోనియా ఆ మాటలు పెడచెవిన పెట్టిన ఫలితంగా తెలంగాణలో పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని ఓ కాంగ్రెస్ నేత అన్నారు. 

మరో నాయకుడైతే.. పీవీ సమాధి పక్కనే జైపాల్ అంత్యక్రియలు జరగడంతో సోనియా రాలేదని.. పీవీ సమాధి చూడడానికి కూడా ఆమె ఇష్టపడదని.. అందుకే రాలేదని మరో వాదన వినిపించారు. మొత్తానికైతే జైపాల్ అంత్యక్రియలకు సోనియా, రాహుల్‌లు రాకపోవడంపై తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. నాయకులు, కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News