సోనియా గుస్సా!...రాహుల్‌ ఫొటో ఇంత చిన్న‌గానా?

Update: 2019-04-03 16:43 GMT
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌... ఈ సారి ఎలాగైనా స‌త్తా చాటాల‌నే య‌త్నిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాకు త‌గ్గ సీట్లు కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి నెల‌కొంటే... ఇప్పుడు ఏకంగా అధికారం చేపట్టే దిశ‌గా ప‌క‌డ్బందీ వ్యూహాల‌తోనే ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ నిన్న‌టికి నిన్న ఏకంగా మేనిఫెస్టోను కూడా విడుద‌ల చేసింది. గతంలో మొద్ద‌బ్బాయి మాదిరి క‌నిపించిన రాహుల్ గాంధీ... ఎన్నిక‌ల‌కు గంట మోగిన త‌ర్వాత స‌త్తా క‌లిగిన నేత‌గానే క‌నిపించ‌డం ఆ పార్టీలో ఉత్సాహం నింపుతోంద‌నే చెప్పాలి. తాను పార్టీ అధ్య‌క్షురాలిగా ఉండ‌గానే కొడుకును ప్ర‌ధానిని చేసుకోవాల‌న్న క‌ల సోనియా గాంధీకి తీర‌నే లేదు. అయితే మ‌రింత కాలం పాటు పార్టీ అధినేత్రిగా కొన‌సాగేందుకు ఆరోగ్యం కూడా స‌హ‌క‌రించ‌డం లేదు. వెర‌సి త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే కుమారుడు ప్ర‌ధాని కాకుండానే పార్టీ ప‌గ్గాల‌ను వ‌దిలేసిన సోనియా.. ఆ ప‌గ్గాల‌ను కొడుకు చేతిలో పెట్టేసి కొంత‌లో కొంత ఉప‌శ‌మ‌నం ల‌బించిన‌ట్టుగా క‌నిపిస్తున్నారు.

అయితే ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ స‌ర్కారును కుప్ప‌కూల్చేసి యూపీఏను అదికారంలోకి తీసుకువ‌చ్చేందుకు చేయాల్సిన ప‌నులేమిట‌న్న విష‌యాల‌ను పార్టీ శ్రేణుల‌కు వివ‌రిస్తూనే సాగుతున్న సోనియా... నిన్న పార్టీ మేనిఫెస్టో విడుద‌ల సంద‌ర్భంగా గ‌రంగ‌రంగా క‌నిపించారు. పార్టీ మేనిఫెస్టో విడుద‌ల వేదిక మీద సోనియా ఆగ్ర‌హానికి గ‌ల కారణాలేమిట‌న్న విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు వేదిక మీద సోనియా అంత కోపంగా ఉన్నార‌న్న విష‌యంలోకి వ‌స్తే... మేనిఫెస్టో పుస్త‌కంపై త‌న కుమారుడు రాహుల్ గాంధీ ఫొటో చాలా చిన్న‌గా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ట‌. అంత పెద్ద పుస్త‌కం మీద‌.. రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సింబ‌ల్ ను చాలా చిన్న‌గా అచ్చేశార‌ట‌. అది కూడా ఎక్క‌డో కింద ఓ మూల‌కు ఆ ఫొటోల‌ను వేశార‌ట‌.

ఈ క‌వ‌ర్ పేజీని చూడ‌గానే భ‌గ్గుమ‌న్న సోనియా... ఈ ప‌ని చేసిందెవ‌రంటూ ఆరా తీశార‌ట‌. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఏఐసీసీ రిసెర్చీ విభాగం అధిప‌తి రాజీవ్ గౌడ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగింద‌ని తెలుసుకున్న సోనియా... ఆయ‌న వైపు గుర్రుగా చూశార‌ట‌. మేనిఫెస్టో డిజైన్ తో పాటు అందులో ఏమేం ఉండాల‌న్న విష‌యాల‌న్నీ కూడా గౌడ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగాయ‌ట‌. ఈ కార‌ణంగానే ఆమె గౌడ వైపు గుర్రుగా చూసిన సోనియా... ఇలా చేస్తే ఎలాగంటూ అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. మొత్తంగా మేనిఫెస్టో ప్ర‌తిపై త‌న కుమారుడి ఫొటో చాలా చిన్న‌గా ఉన్న విష‌యం సోనియాకు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించేసింద‌న్న మాట‌.


Tags:    

Similar News