తాడికొండ త‌మ్ముళ్లకు!...శ్రావ‌ణే కావాల‌ట‌!

Update: 2019-03-15 16:35 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు కీల‌క ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలో అధికార పార్టీ టీడీపీకి వింత ప‌రిస్థితి ఎదురైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొన్ని చోట్ల సిట్టింగ్ ల‌కు సీట్లిస్తే స‌హించేది లేదని ఆ పార్టీ కేడ‌ర్ ఏకంగా వార్నింగులు ఇస్తున్నారు. ఈ త‌ర‌హా నినాదాల‌తో అమ‌రావ‌తిలోని సీఎం నివాసం వ‌ద్ద నిత్యం ర‌చ్చ‌ర‌చ్చ చోటుచేసుకుంటోంది. అదే స‌మ‌యంలో ఈ సారి కూడా త‌మ‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేలే అభ్య‌ర్థులుగా కావాలంటూ మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఈ త‌ర‌హా డిమాండ్ ముందుగా ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో చోటుచేసుకుంది. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావును ఒంగోలు ఎంపీగా పంపేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. అయితే శిద్ధా కాకుండా ఎవ‌రు వ‌చ్చినా ఓడించి తీర‌తామ‌ని ద‌ర్శి తెలుగు త‌మ్ముళ్లు అల్టిమేటం జారీ చేశారు.

తాజాగా ఇదే త‌ర‌హా డిమాండ్ కీల‌క‌మైన జిల్లా గుంటూరు నుంచి వినిపిస్తోంది. ఏ ఒక్క‌రు డిమాండ్ చేయ‌కుండానే గుంటూరు జిల్లా తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి శ్రావ‌ణ్ కుమార్ ను బాపట్ల ఎంపీగా ఎంపిక చేసిన చంద్ర‌బాబు... బాప‌ట్ల‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ‌రామ్ మాల్యాద్రిని తాడికొండ‌కు ఎంపిక చేశారు. ఈ మార్పును తాడికొండ త‌మ్ముళ్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయినా శ్రావ‌ణ్ కుమార్ ప్లేస్‌ ను మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్న త‌మ్ముళ్లు.. త‌మ‌కు ఈ సారి కూడా శ్రావ‌ణ్ కుమారే కావాలని కొత్త డిమాండ్ పెట్టారు. వాస్త‌వానికి తాడికొండ ఎమ్మెల్యేగానే ఉన్నా... రాజ‌ధాని ప‌రిధి వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్ట‌డంలో శ్రావ‌ణ్ చాలా కీల‌కంగానే వ్య‌వ‌హ‌రించారు. సీఆర్డీఏలో ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగానూ వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రావణ్ త‌న‌పై పెద్ద‌గా ఆరోప‌ణ‌లు రాకుండానే రాణిస్తున్నారు.

మొన్నామ‌ధ్య మాత్రం శ్రావ‌ణ్‌కు ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌వ‌ద్దంటూ కొంద‌రు ర్యాలీ నిర్వ‌హించారు. అయితే ఆ విష‌యం తెలుసుకున్న వెంట‌నే శ్రావ‌ణ్ అనుకూల వ‌ర్గం కూడా పోటీ ర్యాలీ నిర్వ‌హించింది. ఈ రెండు ర్యాలీల‌పై నాడు ర‌చ్చ జ‌రిగినా... త‌న‌దైన మంత్రాంగం న‌డిపిన శ్రావ‌ణ్.,.. ఆ వివాదాన్ని అప్పటిక‌ప్పుడే ముగించేశారు. మొత్తంగా ఎమ్మెల్యేగా నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు సాధించ‌డంతో పాటుగా ప్ర‌భుత్వానికి కీల‌క‌మైన విష‌యాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నార‌నే చెప్పాలి. అలాంటి శ్రావ‌ణ్ కుమార్ ను తాడికొండ నుంచి తప్పించేసి బాప‌ట్ల‌కు పంపాల్సిన అవ‌స‌ర‌మేమిట‌న్న‌ది ఇప్పుడు తాడికొండ త‌మ్ముళ్ల ప్ర‌శ్న‌. అంతేకాకుండా త‌మ‌కు ఈ ద‌ఫా కూడా శ్రావ‌ణ్ కుమారే కావాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ఈ డిమాండ్‌ ను చంద్ర‌బాబు ఏ మేర‌కు ప‌ట్టించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News