బాబు పబ్లిసిటీ పిచ్చిని తట్టుకోలేకపోతున్నాం

Update: 2016-08-23 11:37 GMT
మామూలుగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రచార యావ ఎక్కువని రాజకీయవర్గాల్లో టాక్ ఉంది. అలాంటిది ఏదైనా అకేషన్ ఉంటే ఇక చంద్రబాబును ఆపలేమని అంటుంటారు. తాజాగా పుష్కరాలు రావడంతో చంద్రబాబు పబ్లిసిటీ శ్రుతిమించిందని... దానికి తోడు సింధు ఒలింపిక్సు విజయం కూడా కలిసి రావడంతో చంద్రబాబు ప్రచార పిచ్చిని తట్టుకోలేకపోతున్నామని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు. తన వల్లే పీవీ సింధుకు ఒలింపిక్స్ లో పతకం వచ్చిందని చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ఇలాంటి ప్రచారాలతో కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబును ఏకిపారేశారు. చంద్రబాబు అంతా తన వల్లేనని డబ్బా కొట్టుకుంటున్నారని.. చివరకు పుష్కరాలు కూడా తన వల్లే వచ్చాయని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణ - గోదావరి పుష్కరాల పేరిట దాదాపు రూ. 3,500 కోట్లను అధికార పార్టీ నేతలు దోచుకున్నారని, పుష్కరాల కోసం 10శాతం నిధులను ఖర్చు చేస్తే.. 90శాతం నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆయన విమర్శించారు. పుష్కరాలను భక్తితో నిర్వహించాలని తాము కోరుతున్నామని, కానీ, దాన్ని సినిమాలా చేసేసి పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

అలాగే నయీంను పెంచి పోషించింది కూడా చంద్రబాబేనన్న ఆరోపణలున్నాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసునూ ఆయన ప్రస్తావించారు. తెలంగాణ - ఏపీ ప్రభుత్వాలు రహస్య అవగాహనతో  ఓటుకు నోటు కేసును నీరుగార్చాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులపై సీబీఐ విచారణ జరిపించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడే నయీంతో సెటిల్ మెంట్ చేసుకోమని సినిమా వాళ్లకు చెప్పినట్లు ఆరోపణలున్నాయని... ఏపీలోని మిగతా మంత్రులకూ నయీంతో సంబంధాలు ఉండొచ్చని ఆయన అన్నారు. అక్కడితో ఆగని శ్రీకాంత్ రెడ్డి పాత కథలు కూడా బయటకు తీసి చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. బిల్లీరావు - స్టాంపుల కుంభకోణంలో ఉన్న తెల్గీ వంటివారంతా చంద్రబాబు పెంచిపోషించినవారేనని ఆయన ఆరోపించారు.
Tags:    

Similar News