పోలవరం ప్రాజెక్టు సమీపంలో స్టార్ హోటల్.. సీఎం జగన్ రియాక్షన్ ఇదే!

Update: 2023-06-07 10:32 GMT
గడిచిన రెండు.. మూడు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పరిణామాలు చోటుచేసుకోవటం తెలిసిందే. విభజన హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం బాధ్యత తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టును రాష్ట్రం తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకోవటం తెలిసిందే. దీంతో కేంద్రం నిధుల్ని నేరుగా ఇవ్వకుండా రీయింబర్స్ మెంట్ చేస్తూ వస్తోంది. ఇలా పెండింగ్ నిధుల కొండ భారీగా పేరుకున్న వేళ.. తాజాగా కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు అదనంగా రూ.12,911 కోట్ల నిధుల్ని విడుదల చేసేందుకు ఓకే చెప్పటం తెలిసిందే.

ఈ మధ్య జరిగిన జల్ శక్తి శాఖ సమావేశంలో ఆమోదించిన దాని ప్రకారం ఏపీకి పోలవరం ప్పరాజెక్టు నిర్మాణం కోసం భారీగా నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓకే చెప్పటం తెలిసిందే. దీంతో.. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంతఊరట కలిగించనుంది. ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టు పనుల గురించి వివరాలు సేకరించారు. కొన్ని సలహాలు ఇచ్చారు.

మండుటెండల్ని పట్టించుకోకుండా ప్రాజెక్టు ప్రాంతంలో కలియతిరిగిన సీఎం జగన్.. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాల్ని పూడ్చే పనుల్ని పరిశీలించిన ఆయన.. దెబ్బ తిన్న డయాఫ్రమ్ వాల్ ను తిరిగి నిర్మించడంపై అధికారులతో చర్చించారు. రికార్డు సమయంలో కీలక పనుల్ని పూర్తి చేసినట్లుగా ముఖ్యమంత్రితో అధికారులు చెప్పారు.

ఇప్పటికే ఎగువ.. దిగువ కాఫర్ డ్యామ్ లు పూర్తి అయిన నేపథ్యంలో వాటి మధ్య గోదావరి వరదల్లోనూ ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి.. గడువులోపు పూర్తి చేయాలని సూచన చేశారు. ఎండలు మండుతున్న వేళ.. పోలవరం ప్రాజెక్టు వద్ద మొత్తంగా గంటా నలభై నిమిషాల పాటు ప్రాజెక్టును పరిశీలించారు. 960 మెగవాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న జల విదయుదుత్పత్తి కేంద్రం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల్ని చేపట్టిన మేఘా సంస్థ అధినేత క్రిష్ణారెడ్డి .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఆసక్తికర ప్రపోజల్ పెట్టిన విషయం చర్చకు వచ్చింది.

పోలవరం ప్రాజెక్టు సమీపంలో తాము ఒక ఫైవ్ స్టార్ హోటల్ పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారన్నారు. అందుకు సరిపడా స్థలాన్ని కొండ మీద ఇస్తే సరిపోతుందన్న విషయాన్నిఅధికారుల వద్ద సీఎం జగన్ ప్రస్తావించారు. మెఘా అధినేత ప్రపోజల్ కు సీఎం కొన్ని మార్పులు సూచించినట్లుగా తెలిసింది. ఫైవ్ స్టార్ హోటల్ కాకుండా సెవన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. స్థలం మాత్రం కేటాయిస్తే.. పోలవరం ప్రాజెక్టుతో పాటు హోటల్ నిర్మాణాన్ని ఒకే సమయంలో పూర్తి చేస్తామని క్రిష్ణారెడ్డి చెప్పినట్లుగా చెబుతున్నారు.

దీనికి ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును టూరిస్టు స్పాట్ గా తీర్చిదిద్దాలన్న మాటను అధికారులతో చెప్పటం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో సెవన్ స్టార్ హోటల్ ఒకటి రానున్నదన్న మాట.

Similar News