దేశంలోకి తొందరలోనే స్టార్ లింక్

Update: 2023-06-26 19:00 GMT
ఎలన్ మస్క్ ప్రయత్నాలు తొందరలోనే సాకారమయ్యేట్లుంది. దేశంలోకి ఇంటర్నెట్ సేవలతో అడుగుపెట్టాలని ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ళ క్రితమే అడుగుపెట్టాల్సిన మస్క్ కంపెనీ స్టార్ లింక్ కు ఇప్పటికి లైన్ క్లియరయ్యేట్లుగా కనిపిస్తోంది. మోడీ నాలుగురోజుల అమెరికా పర్యటనలో టెస్లా కంపెనీ అధినేత  ఎలన్ మస్క్ తో కూడా భేటీ అయ్యారు. టెస్లా అంటే అందర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతిచెందిన కంపెనీ అన్న విషయం తెలిసిందే.

స్టార్ లింక్ కు గనుక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే దేశంలో తన సేవలను అందించేందుకు రెడీ అయిపోతుంది. నిజానికి రెండేళ్ళ క్రితమే ప్రయోగాత్మకంగా కొందరు వినియోగదారులకు కనెక్షన్లిచ్చింది. అయితే తర్వాత ఏమయ్యిందో ఏమో అన్నింటినీ మూసేసుకుని దేశంనుండి వెళ్ళిపోయింది.

మస్క్ ప్రతిపాదన ఏమిటంటే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన స్పెక్ట్రమ్ లను కేంద్రప్రభుత్వం వేలంద్వారా కాకుండా ఫీజులు కట్టించుకుని లైసెన్సుల రూపంలో ఇవ్వాలని. ప్రస్తుతం మనదగ్గర స్పెక్ట్రమ్ కేటాయింపులు వేలంద్వారా జరుగుతోంది.

అంటే మస్క్ ప్రతిపాదన సాకారం కావాలంటే కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాల్సుంటంది. ఇపుడు దేశంలో ఉన్న ఇంటర్నెట్ ప్రొవైడర్లంతా ఆప్టిక్ ఫైబర్ కేబుళ్ళ ద్వారా మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. భూమి మీద, పోల్స్ మీద వైర్లను లాగి ఇళ్ళకు కనెక్షన్లిస్తున్నారు.

కానీ స్టార్ లింక్ మాత్రం నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు అందిస్తుంది. ప్రతి ఇంటకి ఒక చిన్నపాటి డిష్ ను ఏర్పాటుచేసి దానిద్వారా ఇళ్ళలోకి ఇంటర్నెట్ సిగ్నల్స్ అందిస్తుంది.

ఇపుడున్న ఇంటర్నెట్ సేవలతో పోల్చితే స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ చాలా స్పీడుగా పనిచేస్తుందనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో చాలా ఖరీదు కూడా. ఎంతమంది స్టార్ లింక్ ధరలను తట్టుకుని సేవలన పొందుతారన్నది అనుమానమే.

ఇపుడు వివిధ ప్రొవైడర్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుకుంటున్న వినియోగదారుల్లో ఒకరిద్దరు కూడా స్టార్ లింక్ సేవల ధరలను భరించలేరు. మరి థరల విషయాన్ని మస్క్ గనుక సవరించుకుని తక్కువ ధరలకే అందించగలిగితే వినియోగదారులు ఎక్కువమంది చేరే అవకాశముంది.

Similar News