రాష్ట్రాలకు నిర్మలమ్మ ఉచిత సలహా.... అప్పులు తీసుకోవాలట

Update: 2020-08-27 17:00 GMT
అసలే ఆపద కాలం. ప్రాణాంతక వైరస్ కరోనా నేపథ్యంలో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఇక మన దేశంలోని రాష్ట్రాల పరిస్థితి ఇందుకు బిన్నమేమీ కాదు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ లాంటి రాష్ట్రాలు అయితే కరోనా దెబ్బకు అల్లాడిపోయాయి. గల్లా పెట్టే ఖాళీ అయిపోగా... ఉద్యోగుల వేతనాల కోసం ముందూవెనుకా ఆలోచించాల్సిన దుస్థితి. ఇలాంటి తరుణంలో పెద్దన్న పాత్రలో ఉన్న కేంద్రమే ఆదుకోవాలి. అయితే అందుకు బిన్నంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తోందని చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు ఉచిత సలహాలు పడేసి చేతులు దులిపేసుకున్నారు. అవసరం మేరకు అప్పులు చేసుకోండి అంటూ నిర్మలమ్మ ఇచ్చిన ఉచిత సలహాపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు భగ్గుమంటున్నాయి.

కరోనా తీవ్రత నేపథ్యంలో జరిగిన 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనగానే... ఇప్పటికే రెండు భారీ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఆశలతోనే వెళ్లాయి. అయితే సమావేశంలో ఈ తరహా చర్చ అసలు ప్రస్తావనకు రాకపోగా... అవసరం మేరకు అప్పులు చేసుకోండి అంటూ నిర్మల సీతారామన్ సూచించడంతో ఆయా రాష్ట్రాల ప్రతినిధులు ఊసురుమన్నారట. అవసరాలను తీర్చుకోవడానికి ఆచరణ సాధ్యమూన పరిష్కారం అప్పులు చేయడమేనని నిర్మల తనదైన శైలి వ్యాఖ్యలు చేశారట. అంతటితో ఆగని నిర్మల... కరోనా వల్ల జరిగిన నష్టాలను భర్తీ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వానికి లేదని అటార్నీజనరల్ చెప్పారని కూడా నిర్మల మరో సంచలన వ్యాఖ్య చేశారట. మొత్తంగా కరోనా కారణంగా దీలా పడిపోయిన రాష్ట్రాలను ఆదుకునే బాధ్యత కేంద్రానిది కాదని నిర్మల తేల్చేశారట.

నిర్మల నోట నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడంతో ఢిల్లీ, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయట. ఈ క్రమంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అయితే కేంద్రం వైఖరిని తూర్పారబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారట. అవసరానికి మించి సుంకాలను వసూలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.47 వేల కోట్లను భారత దేశ ఏకీకృత నిధికి బదిలీ చేసిందని, ఇప్పుడు నిధుల కొరత ఏర్పడినప్పుడు అప్పులు తెచ్చుకోవాలంటూ సూచించడం కేంద్రానికి తగదని, అసలు ఈ తరహా వైఖరి మంచి పరిణామం కాదని కూడా నిర్మల ముఖం మీదే చెప్పేశారట. అయినా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిన గురుతర బాధ్యత కలిగిన కేంద్రం... అవసరం మేరకు రుణం తెచ్చుకోండి అంటూ రాష్ట్రాలకు ఉచిత సలహాలు పడేయడం ఎంతవరకు సమంజసమని కూడా ఆయన కేంద్రం వైఖరిపై నిప్పులు చెరిగారట.
Tags:    

Similar News