దుర్గమ్మ రథంపై మాయమైన సింహాల ప్రతిమలు !

Update: 2020-09-16 06:50 GMT
విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామి వెండి రథానికి ముందూ, వెనుక రెండేసి సింహాలు ఉంటాయి. వీటిలో మూడు సింహాలు అదృశ్యమయ్యాయన్న విషయం బయటికి రావడంతో ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. అంతర్వేది ఘటన తర్వాత పోలీసుల సూచన మేరకు దేవాలయ అధికారులు వెండి రథాన్ని పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడినట్లు సమాచారం. అయితే , దీన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. గతేడాది ఉగాది సందర్భంగా ఉత్సవ మూర్తులను రథంపై ఊరేగించారు. ఈ సారి కరోనా కారణంగా రథాన్ని బయటకు తీయలేదు. దానిపై ఇప్పటికీ ముసుగు వేసే ఉంచారు. తాజా తనిఖీల్లో వెండి సింహల ప్రతిమలు మాయం అయ్యాయి.

బెజవాడ దుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయమైన వ్యవహారం బయటికిరావడం ఆలయ ఈవో సురేష్‌ బాబు స్పందించారు. ఈ వ్యవహారంపై తక్షణం విచారణ నిర్వహించి వాస్తవాలు నిగ్గుతేలుస్తామన్నారు. ఇవాళ విచారణ నిర్వహించేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు వెండి సింహాలు ఎప్పుడు పెట్టారు, చివరి సారిగా రథాన్ని ఎప్పుడు వాడారు, ఆ తర్వాత ఎవరి నియంత్రణలో ఉంది, అసలు వెండి సింహాలు ఉన్నాయా, అదృశ్యమయ్యాయా, అయితే ఎలా అయ్యాయన్న అంశాలపై ఈవో సమక్షంలో విచారణ జరగనుంది.భక్తులు ఎంతో సెంటిమెంట్‌గా భావించే కనకదుర్గమ్మ గుడి నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం, ఆ తర్వాత వివాదాలు వాటంతట అవే సద్దుమణగడం కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ఈసారి వెండిరథంపై వెండి సింహాల మాయం ఘటన నేపథ్యంలో అధికారులు ముందుగా విచారణ నిర్వహించనున్నారు. దీనిపై సమగ్ర పరిశీలిన తరువాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం అని ,ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తరువాత , పోలీసులకి ఈవోకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.


Tags:    

Similar News