హైద‌రాబాద్ వాసుల్లో ఆ కేసులు ఎక్కువ‌ట‌!

Update: 2018-07-18 04:44 GMT
హైద‌రాబాద్ మ‌హిళ‌ల‌కు నిజంగానే ఇది షాకింగ్ న్యూస్‌. ఆ మాట‌కు వ‌స్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోని  మ‌హిళ‌ల‌కు కూడా. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రొమ్ము కేన్స‌ర్ కేసులు బాగా పెరిగిపోతున్న వైనం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఇతర రాష్ట్రాల‌తో పోలిస్తే.. హైద‌రాబాద్ లో రొమ్ము కేన్స‌ర్ కేసులు ఎక్కువ అవుతున్న వైనాన్ని గుర్తించారు.

మ‌రే రాష్ట్రంలోనూ లేని రీతిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతూ.. అందుకు నిద‌ర్శ‌నంగా గ‌ణాంకాల్ని ప్ర‌స్తావిస్తున్నారు. గ‌డిచిన ఏడాదిలో తెలంగాణ‌.. ఏపీల‌లో 9 వేల కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏడాది ల‌క్ష‌న్న‌ర కొత్త కేసులు న‌మోదు అవుతున్న వైనాన్ని తాజాగా ఒక అధ్య‌య‌నం స్ప‌ష్టం చేస్తోంది.

రొమ్ము కేన్స‌ర్ కు గురైన మ‌హిళ‌ల్లో ఏటా 70వేల మంది మ‌ర‌ణిస్తున్నారు. గ‌తంలో యాభై దాటిన త‌ర్వాత మ‌హిళ‌లు రొమ్ము కేన్స‌ర్ బారిన ప‌డేవారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా 30 ఏళ్ల లోపు వారు కూడా దీని బారిన ప‌డుతున్న‌ట్లు గుర్తించారు.

గ్రామాలు.. ప‌ట్ట‌ణాల‌తో పోలిస్తే న‌గ‌రాల్లో రొమ్ము కేన్స‌ర్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లుగా తేలింది. జీవ‌న శైలిలో వ‌చ్చిన మార్పులు కూడా దీనికి కార‌ణంగా భావిస్తున్నారు. ప్ర‌స్తుతం చాలామంది మ‌హిళ‌లు ఆల‌స్యంగా పెళ్లి చేసుకోవ‌టం.. ఆల‌స్యంగా పిల్ల‌ల్ని క‌న‌టం కూడా కేన్స‌ర్ తీవ్ర‌త పెర‌గటానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని అంకాల‌జిస్టులు చెబుతున్నారు. 21 ఏళ్ల లోపు మొద‌టి గ‌ర్భం దాలిస్తే.. కేన్స‌ర్ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు.

రొమ్ము కేన్స‌ర్ ను అధిగ‌మించ‌టానికి మ‌హిళ‌లు ముంద‌స్తుగా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న అంశంపై సీనియ‌ర్ వైద్యులు చెబుతున్న సూచ‌న‌లు చూస్తే.. మంచి జీవ‌న‌శైలి.. ఆహార నియ‌మాలు పాటించ‌టం.. క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌టం త‌ప్ప‌నిస‌రని చెబుతున్నారు. 40 ఏళ్లు దాటిన ప్ర‌తి మ‌హిళా త‌ప్ప‌నిస‌రిగా రొమ్ము స్కానింగ్ చేయించుకోవాల‌ని.. దీంతో.. కేన్స‌ర్ ల‌క్ష‌ణాలు ఏమైనా ఉంటే.. తొలిద‌శ‌లోనే గుర్తించే వీలుంద‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్ మ‌హిళ‌లు.. ఈ అంశంపై మీద కాస్త ఎక్కువ‌గా దృష్టి సారించ‌టం మంచిది.



Tags:    

Similar News